ఇబ్రహీంపట్నం: కులాంతర వివాహాలు చట్ట విరుద్ధం కాదని, ఆదర్శ వివాహాలను పౌర సమాజం ప్రోత్సహించాలని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు అన్నారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో మంగళవారం చిట్టంపల్లి ప్రసాద్, ఆకుల జయశ్రీల కులాంతర వివాహాన్ని కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఆయన కులాంతర వివాహం చేసుకుంటున్న జంటకు పూలదండలు మార్పించి, ప్రమాణ ప్రతాలు చదివించారు. ఈ సందర్భంగా స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. వివాహానికి కులం, మతం అడ్డుగోడలుగా నిలువద్దన్నారు. కుల, మతాంతర వివాహాలు చేసుకున్న వారిపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలను అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కులం కంటే గుణం, మతం కంటే మానవత్వం గొప్పగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సామేల్, కార్యదర్శి ప్రకాశ్ కారత్, ఉపాధ్యక్షుడు అరుణ్‌కుమార్, ప్రముఖ కవి బండి సత్తన్న, ముసలయ్య, పురుషోత్తం, ఆనంద్, స్వప్న, యాదయ్య, కిరణ్, అశోక్ పాల్గొన్నారు.


