చేవెళ్ల: మేకల మందపై వీధి కుక్కలు దాడి చేయడంతో 18 మేకలు మృతి చెందాయి. మరో నాలుగు త్రీవంగా గాయపడ్డాయి. ఈ సంఘటన మున్సిపల్ పరిధిలోని దేవునిఎర్రవల్లిలో చోటు చేసుకుంది. బాధితుడు కకంటి శ్రీశైలం, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవునిఎర్రవల్లికి చెందిన కంకంటి శ్రీశైలం తనకున్న 23 మేకలను మేపుకొంటూ జీవిస్తున్నాడు. గ్రామ సమీపంలోని పొలం వద్ద షెడ్‌లో ప్రతిరోజు రాత్రి వాటికి కాపలాగా పడుకునేవాడు. సోమవారం రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉన్న అతడు వర్షం పడే సూచన ఉండటంతో షెడ్‌కు తాళం వేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం వచ్చి చూసే సరికి 18 మృతి చెంది, మరో నాలుగు గాయాలతో కనిపించాయి. వీధి కుక్కలు దాడి చేసి మేకలను ఇష్టానుసరంగా కొరికి చంపేశాయి. బాధితుడు లబోదిబోమంటూ వెట ర్నరీ వైద్యులకు సమాచారం అందించాడు. చేవెళ్ల వెటరర్నీ వైద్యుడు డాక్టర్ తిరుపతిరెడ్డి వచ్చి పరిశీలించాడు. గాయపడ్డ వాటికి వైద్యం చేశారు. వాటి పరిస్థితి కూడా విషమంగానే ఉందని తెలిపారు. రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు.


