మహేశ్వరం: కొనేరులో పడి గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన బుధవారం మండల కేంద్రంలో శివగంగ ఆలయ కొనేరులో చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల కేంద్రంలో కొలువుదీరిన శివగంగ రాజరాజేశ్వర ఆలయానికి ఉదయం భక్తులు వచ్చారు. ఈ సమయంలో గుర్తు తెలియని వృద్ధ మహిళ కొనేరులో పడినట్లు గుర్తించిన భక్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలి మృతదేహాన్ని బయటకు వెలికితీసి కేసు నమోదు చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలు ఎరుపు చీర, చేతికి పచ్చబొట్లు, బంగారు రంగు గాజులు, మెడలో ఎరుపు రంగు పూసల గొలుసు ధరించి ఉంది. మృతురాలి వయస్సు 55–65 సంవత్సరాల మధ్యన ఉంటుందని.. సంబంధీకులు ఎవరైనా ఉంటే మహేశ్వరం పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కోరారు. వివరాలకు ఎస్‌హెచ్‌ఓ 87126 62368, 87126 62404 నంబర్లలో సంప్రదించాలన్నారు.
ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
అనంతగిరి: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇందులో భాగంగా బ్లాక్ స్పాట్లను గుర్తించాలని ఎస్పీ స్నేహమెహ్ర ఆదేశించారు. బుధవారం వికారాబాద్‌లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శాంతిభద్రతలు, పెండింగ్ కేసులు, నేరాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసులపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దొంగతనాల నియంత్రణకు, కేసుల ఛేదనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చోరీ సొత్తు రికవరీ చేసి బాధితులకు అందేలా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. మహిళలు, బాలల భద్రతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాపాలనా – ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బీ రాములు నాయక్, డీఎస్పీలు జానయ్య, శ్రీనివాసులు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
రూ.10 లక్షలతో గ్రామైక్య భవనం
సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం


