బోయినిపల్లి కూరగాయల మార్కెట్ వద్ద నిరసన చేపట్టిన రైతులు
చేవెళ్ల: కూరగాయల మార్కెట్‌లలో ఎదరవుతున్న సమస్యలపై ప్రశ్నించిన రైతులు, రైతు నాయకులపై కేసులు పెట్టడం సరకాదని రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం చేవెళ్ల ప్రాంతానికి చెందిన పలువురు రైతులు సికింద్రాబాద్‌లోని బోయినిపల్లి కూరగాయల మార్కెట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్‌లో రైతుల వద్ద నుంచి రూ.వందకు కమీషన్ రూ.4 తీసుకోవాలని ఇతర రాష్ట్రాల కూరగాయలు సీజన్‌లో తీసుకురావద్దని, సంచుల బరువు తగ్గించవద్దని, అమవాస్యకు, కమీషన్ ఏజెంట్లు మరణించినచో వారి సంతాపంగా మార్కెట్ మొత్తం మూసివేయవద్దనే అంశాలపై రైతుల పక్షాన నిలబడి 2019 అక్టోబర్‌లో నిరసన తెలిపితే అప్పట్లో కమీషన్ ఏజెంట్లు, అప్పటి మార్కెట్ కార్యదర్శి పద్మహర్షలు రైతులపై కక్షపూర్తిగా కేసులు పెట్టించి ఏడేళ్లుగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారన్నారు. కమీషన్ ఏజెంట్ల అక్రమాలపై ప్రభుత్వం, అధికారులు స్పందించాలన్నారు. లేదంటే రైతు నాయకులమంతా కలిసి కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో రైతులు చింపుల సత్యనారాయణరెడ్డి, యాలాల కరుణాకర్‌రెడ్డి, సి.మల్లేశ్, కె.రాజిరెడ్డి, శ్రీరాంరెడ్డి తదితరులు ఉన్నారు.


