రాహుల్‌ పర్యటనకు పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

రాహుల్‌ పర్యటనకు పటిష్ట భద్రత

Mar 1 2026 8:37 AM | Updated on Mar 1 2026 8:37 AM

రాహుల్‌ పర్యటనకు పటిష్ట భద్రత

రాహుల్‌ పర్యటనకు పటిష్ట భద్రత

ఎస్పీ స్నేహ మెహ్ర

అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

అనంతగిరి: వికారాబాద్‌ సమీపంలోని అనంతగిరి గుట్టలో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం హాజరుకానుండటంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ స్నేహ మెహ్ర అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వీవీఐపీల పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అత్యున్నత స్థాయి భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా బందోబస్తుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను వివరించారు. హెలిప్యాడ్‌ వద్ద భద్రత, కాన్వాయ్‌ ప్రయాణించే రూట్‌ మ్యాప్‌, సభా ప్రాంగణం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. పర్యటన సాగే మార్గాల్లో ముందస్తుగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఎక్కడా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పర్యటన ప్రశాంతంగా ముగిసేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ బీ రాములు నాయక్‌, డీఎస్పీలు శ్రీనివాస్‌, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసులు, జానయ్య, వీరేష్‌, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.

క్రమశిక్షణ, సమయపాలనతో..

పట్టణంలోని మైదానంలో వారాంతపు పరేడ్‌ నిర్వహించారు. ఎస్పీ పాల్గొని పోలీసు సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పరేడ్‌ నిర్వహించడం వల్ల క్రమశిక్షణ, సమయపాలనతో పాటు ఒకరితో ఒకరికి సమన్వయం పెరుగుతుందని తెలిపారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది విధి నిర్వహణలో అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించాలన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

భద్రత ఏర్పాట్లు పరిశీలన

జిల్లా కేంద్రం వికారాబాద్‌లో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఎస్పీ స్నేహమెహ్ర, అడిషనల్‌ కలెక్టర్‌ రాజేశ్వరి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి భద్రత ఏర్పాట్లన పరిశీలించారు. హెలిపాడ్‌ ప్రాంతం, రూట్‌మ్యాప్‌, అనంతగిరిలోని హరిత రిసార్ట్స్‌ను సందర్శించారు. అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement