భద్రతా నియమాలు తప్పనిసరి
చేవెళ్ల: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ బాధ్యత వహించాలని చేవెళ్ల ఏసీపీ కిషన్ అన్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపడుతున్న అరైవ్, అలైవ్ అవగాహన కార్యక్రమంలో డ్రైవర్లకు చేవెళ్లలో ఉచిత వైద్య పరీక్షలు, షాబాద్‌లో పోలీస్ సిబ్బందికి హెల్మెంట్‌ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం పట్నం మహేందర్‌రెడ్డి ఆసుపత్రిలో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఏసీపీ కిషన్ మాట్లాడుతూ.. డ్రైవర్లు తప్పనిసరిగా కంటి చూపును ఎప్పటికప్పుడు పరిక్షించుకోవాలని చెప్పారు. షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సీఐ కాంతారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందికి హెల్మెంట్‌లు పంపిణీ చేశారు.
పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు
శంకర్‌పల్లి: ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని చేవెళ్ల ఏసీపీ కిషన్ అన్నారు. ‘అరైవ్–అలైవ్’ రెండో విడత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని మోకిలలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఏసీపీ మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడంతో రోజురోజుకు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని, తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో తమ మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. మోకిల ఎస్‌ఐలు కోటేశ్వర్ రావు, సాయి క్రిష్ణ పాల్గొన్నారు.


