అడ్డదారిలో.. వ్యాపారులు!
స్వచ్ఛతను గుర్తించొచ్చు ఇలా..
ప్రస్తుత జనాభా అవసరాలకు.. క్షేత్రస్థాయిలో లభిస్తున్న పాలకు మధ్య పొంతన ఉండడం లేదు. డిమాండ్‌కు, సరఫరాకు మధ్య వ్యత్యాసం ఉండడంతో పలువురు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పసిపిల్లలు తాగే పాలను కల్తీ చేస్తున్నారు. తాజాగా కడ్తాల్ మండలం రావిచేడుకు చెందిన ఓ పాల వ్యాపారి కల్తీపాలను తయారు చేస్తూ పట్టుబడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎప్పటికప్పుడు డెయిరీల్లో తనిఖీలు నిర్వహించి, పాల నాణ్యతను పరిశీలించాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో నకి‘లీల’ కు అడ్డూఅదుపు లేకుండా పోతోంది.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పాల దిగుబడి క్రమంగా తగ్గిపోతోంది. అధిక సంపాదనే లక్ష్యంగా కొంతమంది డెయిరీ వ్యాపారులు దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. ప్రజారోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. కొంతమంది పరిమితికి మించి కుళాయి నీళ్లు కలుపుతుంటే.. మరికొంత మంది ఏకంగా కృత్రిమ పాలను తయారు చేసి గుట్టుగా మార్కెట్‌కు తరలిస్తున్నారు. కడ్తాల్, ఆమనగల్లు, కాటేదాన్, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ముచ్చింతల్, పసుమాముల, నాదర్‌గుల్ తదితర ప్రాంతాల్లో కల్తీపాల దందా జోరుగా సాగుతోంది. మూతపడిన పరిశ్రమలను ఇందుకు వేదికగా చేసుకుంటున్నారు. ప్రముఖ బ్రాండ్లకు తీసిపోని విధంగా ప్యాకెట్లను తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు.
అధిక దిగుబడి కోసం ఆక్సిటోసిన్
ప్రస్తుతం రైతుల భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. డెయిరీల నిర్వహణ భారంగా మారింది. కూలీలు, పశువుల మేత, దాణా ఖర్చులు రెట్టింపయ్యాయి. దీంతో చాలా మంది రైతులు పాల డెయిరీలకు దూరమయ్యారు. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన పాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో కొందరు అధిక పాల దిగుబడి కోసం తమ గేదెలు, ఆవులకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇస్తున్నారు. ప్రమాదకరమైన బీర్‌దాణాను తాగిస్తున్నారు. ప్రత్యక్షంగా తమ పశువుల ఆయుఃప్రమాణాన్ని తగ్గించడంతో పాటు పరోక్షంగా పాలను తాగిన చిన్నారుల అనారోగ్యానికి కారణమవుతున్నారు.
కుళాయి నీళ్లు.. పామాయిల్‌తో కలుషితం
సహజంగా గేదె, ఆవు పాలల్లో ఐదు నుంచి ఏడు శాతం వెన్న ఉంటుంది. వీటికి ఆయా డెయిరీలు రైతులకు లీటరుకు రూ.35 నుంచి రూ.40 వరకు చెల్లిస్తుంటాయి. డెయిరీలు చెల్లించే ధరలు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో కొంతమంది స్వయం ఉపాధి కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో డబ్బా వాళా అవతారం ఎత్తుతున్నారు. డెయిరీలు సరఫరా చేసే ప్యాకేజ్డ్ పాలతో పోలిస్తే వ్యక్తిగత డెయిరీల నిర్వాహకులు సరఫరా చేసే స్వచ్ఛమైన పాలలో వెన్నశాతం అధికంగా ఉండటంతో చాలామంది వీటిని ఇష్టపడుతున్నారు. ప్యాక్‌డ్ ధరతో పోలిస్తే వీరు సరఫరా చేసే పాల ధరే ఎక్కువే అయినప్పటికీ.. తమ పిల్లలకు స్వచ్ఛమైన గేదె, ఆవు పాలు పట్టించాలనే ఉద్దేశంతో చాలామంది వీరిని ఆశ్రయిస్తున్నారు. ప్రజల్లో ఉన్న బలహీనతను కొంత మంది వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పాలలో వెన్నశాతాన్ని పెంచేందుకు అక్రమ మార్గం పడుతున్నారు. రెండు లీటర్ల పాలను తీసుకుని అందులో కొంత యూరియా, పామాయిల్ కలుపుతూ కల్తీ చేస్తున్నారు. ప్రమాదకరమైన కృత్రిమ పాలతో పాటు కలుషిత నీరు, ఈకొలి, కోలిఫాం వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో కూడిన పాలను తాగి చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారు.
స్వచ్ఛమైన పాలు 0.55 డిగ్రీల సెంటిగ్రేడ్‌ల వద్ద గడ్డకడతాయి. ఈ ఉష్ణోగ్రత మారిందంటే అందులో నీరు కలిసిందని అర్థం.
లాక్టోమీటర్ పరికరంలో పాలు పోయగానే అందులో కొవ్వు కాకుండా ఇతర ఘనపదార్థాలు (ఎస్‌ఎన్‌ఎఫ్) ఎంత శాతం ఉందో తెలిసిపోతుంది.
పాలను వేడి చేసినప్పుడు వచ్చే ఆవిరితో ఏర్పడే ఘనపు రేణువులు స్పటికాల రూపంలో ఘనీభవిస్తే అందులో యూరియా కల్తీ చేసినట్లు భావించొచ్చు.
స్వచ్ఛమైన పాలు బండపైపోస్తే అవి ప్రవహించినంత దూరం తెల్లటి ధార కనిపిస్తుంది. అరచేతిని వెనుక వైపు తిప్పి..మరో చేత్తో కొన్ని చుక్కల పాలను దానిపై పోస్తే నాణ్యమైన పాలైతే సన్నటి ధారలా ప్రవహిస్తుంది. నీళ్లు కలిపినవైతే ధార ఏర్పడకుండా చివర్లో తెల్లటి చుక్క నిలిచిపోతోంది.
వేడి చేసినప్పుడు పాలపై పసుపు పచ్చగా మీగడ రూపంలో పేరుకుపోవడం, తోడు వేసినప్పటికీ పెరుగు కాకపోవడం, వంటి లక్షణాలు కన్పిస్తే ఆ పాలలో వనస్పతి ఆయిల్ కలిసినట్లు గుర్తు.
పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు హైడ్రోజన్ పెరాకై ్సడ్ కలుపుతున్నారు. వీటిని కాగబెట్టి తోడు వేస్తే తర్వాత పెరుగుగా మారకపోగా నీళ్ల రూపంలో కనిపిస్తుంది. దీన్ని యూరియాసే స్ట్రిప్స్ ద్వారా నాణ్యతను గుర్తించొచ్చు.
ధనార్జనే ధ్యేయంగా కల్తీమయం
మార్కెట్‌లో యథేచ్ఛగా విక్రయం
అనారోగ్యం పాలిట జనం
పట్టించుకోని అధికారగణం


