బదిలీ కుదుపు
గ్రేటర్‌లో తరచూ స్థాన చలనం
● పాలనపై తీవ్ర ప్రభావం
● పరిస్థితి గందరగోళం
● ఉలిక్కిపడ్డ ట్రైసిటీ.. గ్రేటర్ జిల్లాలు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా టీ క్యూర్ (కోర్‌సిటీ అర్బన్ రీజియన్ వరకు), రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పలువురు అధికారులకు స్థానచలనం జరిగింది. గురువారం ఉదయమే వెలుగులోకి వచ్చిన ఈ బదిలీలు అధికార వర్గాల్లో ఓ కుదుపు కుదిపాయి. ఆయా స్థానాల్లో బాధ్యతలు చేపట్టి నెలలు కూడా పూర్తికాని వారు బదిలీల జాబితాలో ఉన్నారు. దీంతో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒకే సమయంలో భారీ సంఖ్యలో ఐఏఎస్‌ల బదిలీలు, అందులోనూ అనతికాలంలోనే జరిగిన బదిలీలతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, టీ క్యూర్ మూడు కార్పొరేషన్ల ఏర్పాటు నేపథ్యంలో ఇప్పటికే గందరగోళ పరిస్థితులు నెలకొనగా.. తరచూ ఉన్నతాధికారుల బదిలీలతో పరిస్థితి మరింత గందరగోళంగా మారుతోంది.
ముగ్గురు జోనల్ కమిషనర్ల మార్పు
● టీ క్యూర్‌లోని ట్రైసిటీ పరిధిలో ముగ్గురు జోనల్ కమిషనర్లు మారారు. ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా ఇద్దరు జోనల్ కమిషనర్లను మార్చి వారి స్థానాల్లో ఇతరులను నియమించారు. అంతర్గత బదిలీల్లో భాగంగా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌ను తప్పించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా ఉన్న అనురాగ్ జయంతి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో మందా మకరందుకు పోస్టింగ్ ఇచ్చారు.
● సైబరాబాద్ మున్సిపల్ కార్పొషన్ (సీఎంసీ)లోని కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ సందీప్‌కుమార్ ఝా స్థానే పర్మార్ పింకేశ్‌కుమార్ లలిత్‌కుమార్‌ను నియమించారు.
● జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కార్పొరేషన్‌లో యూసీడీ, స్పోర్ట్స్ విభాగాల అడిషనల్ కమిషనర్ కె.అలివేలు మంగతాయారును సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు.
● సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌తో పాటు పారిశుద్ధ్య విభాగం అడిషనల్ కమిషనర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎన్. రవికిరణ్‌ను పారిశుద్ధ్యం విభాగం రెగ్యులర్ అడిషనల్ కమిషనర్‌గా నియమించారు.
● రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా ఉన్న అనురాగ్ జయంతి రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌తో పాటు రెవెన్యూ, ఐటీ, ప్రకటనల విభాగాల అడిషనల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆయన బదిలీతో ఈ విభాగాలకు మళ్లీ కొత్తవారిని నియమించాల్సి ఉంది.
● హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా శివేంద్రప్రతాప్ బాధ్యతలు స్వీకరించారు. మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్ నియమితులయ్యారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీగా జితేష్ వి పాటిల్ నియమితులయ్యారు. కొత్త డిస్కం సీఎండీగా ముషారఫ్ ఫారూఖీ నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా అదనపు (లోకల్ బాడీసీ) కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు. కుమురంభీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్‌గా పని చేసిన దీపక్ తివారి వికారాబాద్ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు.


