మహిళ అదృశ్యం
పహాడీషరీఫ్: మహిళ అదృశ్యమైన సంఘట న పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తుక్కుగూడ మంఖాల్ గ్రామానికి చెందిన బైండ్ల ఎల్లమ్మ(58) ఈ నెల 22వ తేదీన ఉస్మానియాలో చికిత్స పొందుతున్న కూతురును చూసాక, అల్లుడు సాయంత్రం తుక్కుగూడలో బైక్‌పై వదిలేశాడు. అక్కడి నుంచి ఇంటికి రావాల్సిన ఆమె ఎంతకీ రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయమై ఆమె భర్త నర్సింహ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వ్యక్తి..
కేశంపేట: విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వేములనర్వకు చెందిన శ్యామల సాయికిరణ్ తుక్కుగూడలో పనిచేస్తూ, కుటుంబంతో కలిసి నగరంలో జీవిస్తున్నాడు. ఈక్రమంలో భూముల విషయాలు మాట్లాడుకునేందుకు ఆదివారం స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం ఉదయం తన అమ్మమ్మ గారి గ్రామమైన ఇర్విన్‌కు వెళ్తున్నట్లు భార్య చంద్రకళకు చెప్పాడు. అదే రోజు రాత్రి ఇర్విన్ నుంచి శ్రీశైలం వెళ్తున్నానని మళ్లీ ఫోన్ చేశాడు. అనంతరం మొబైల్ స్విచ్చాఫ్ వస్తుండటంతో బాధితురాలు బుధవారం కేశంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలిపారు.
అనుమతి లేకుండా ఇసుక తరలించొద్దు
యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి
యాలాల: ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని కోకట్ గ్రామ శివారులోని కాగ్నా నది నుంచి ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఇప్పటికే ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలతో పాటు యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు. మండల పరిధిలో ఎక్కడైన ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు. కాగా బుధవారం ఇసుక తరలిస్తుండగా పట్టుబడ్డ వాహనాలను పీఎస్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పోయిన పర్సు అప్పగింత
కేశంపేట: మండల పరిధిలోని లేమామిడి గ్రామానికి చెందిన రాఘవేందర్‌చారి మండల కేంద్రంలోని బస్టాప్ వద్ద పర్సు పోగొట్టుకున్నాడు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీఐ నరహరి ఆదేశం మేరకు రంగంలోకి దిగిన సిబ్బంది గంటల వ్యవధిలో పర్సును గుర్తించి, అతనికి అందజేశారు. అందులో రూ.4 వేలతో పాటు పలు కార్డులు ఉన్నాయని, పోలీసులు సకాలంలో స్పందించడంతోనే ఇది సాధ్యమైందని బాధితుడు సంతోషం వ్యక్తంచేశాడు.
ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం..
ఒకరి మృతి
శంషాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై గుర్తు తెలియని వాహనాలు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం బుధవారం తెల్లవారు జామున శంషాబాద్‌లో ఓఆర్‌ఆర్‌పై గచ్చిబౌలి వైపు నుంచి నడుచుకుంటూ వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తి(45)ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన అతడి కాలుపై నుంచి మరో వాహనం దూసుకెళ్లింది. రెండు వాహనాలు ఢీ కొనడంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
మహిళ అదృశ్యం


