ఈనెల 27, 28న విధులకు ఎందుకు రాలేదు!
బషీరాబాద్: ఈ నెల(ఫిబ్రవరి) 27, 28 తేదీల్లో తన అనుమతి లేకుండా విధులకు ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాలంటూ బషీరాబాద్ కాంప్లెక్స్ హెచ్‌ఎం ఎండీ షరీఫ్ ఓ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎంకు రెండు రోజుల క్రితం జారీ చేసిన మెమో విమర్శలకు దారితీసింది. వివరాలు.. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్న కె.శోభ ఈనెల 9 నుంచి 12 వరకు సెలవు మంజూరు చేయాలని కోరుతూ 6న కాంప్లెక్స్ హెచ్‌ఎం షరీష్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సదరు అధికారి అనుమతితో సెలవుపై వెళ్లారు. తర్వాత 14 నుంచి 16 వరకు వరుస సెలవులు రావడంతో 17న కూడా సెలవును పొడిగించుకుని 18న విధులకు హాజరయ్యారు. బడికి వచ్చిన ఆమె రిజిస్టర్ చూడగా సెలవు పెట్టిన రోజులన్నీ గైర్హాజరైనట్లు షరీఫ్ రాశా రు. ఇదేమిటని ప్రశ్నించగా పొంతనలేకుండా సమాధానాలు చెబుతున్నారని శోభ ఆరోపించారు. తీరా ఈ నెల 23న ఆఫీస్ సిబ్బందితో ఓ మెమో జారీ చేశారు. అందులో తన అనుమతి లేకుండా ఈ నెల 9 నుంచి 13 వరకు, అలాగే గతేడాది ఫిబ్రవరి 20 నుంచి ఈ నెల 27 వరకు విధులకు ఎందుకు హాజరు కాలేదని మెమోలో ప్రశ్నించారు. దీంతో పాటు ఈ నెల 28న తన అనుమతి లేకుండా ఆన్‌డ్యూటీలో ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. వీటికి రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొనడంతో విస్మయానికి గురైన సదరు హెచ్‌ఎం ఇంకా 27, 28 తేదీలు రాకముందే, తాను గైర్హాజరయ్యానని మెమో ఎలా జారీ చేస్తారని తోటి ఉపాధ్యాయుల వద్ద వాపోయారు. ఈ విషయం, మెమో కాపీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కాంప్లెక్స్ హెచ్‌ఎం షరీఫ్‌ను వివరణ కోరగా తాను మెమో జారీ చేశానని, అందులో తప్పులు దొర్లినందున సరిచేస్తానని చెప్పారు.
హెచ్‌ఎంకు కాంప్లెక్స్ హెచ్‌ఎం మెమో జారీ


