కమనీయం.. రమణీయం
ఘనంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం
ఆమనగల్లు: పట్ణంలోని వేంకటగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం తొలుత స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ఆలయ ధర్మకర్త గూడ కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో అలివేలుమంగ సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకను తిలకించారు. భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. ఉత్సవంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు తల్లోజు గీత, పాపిశెట్టి రాము, స్థానికులు బికుమాండ్ల పాండయ్య, దేవేందర్‌శెట్టి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కల్కిదోన దేవాలయంలో..
తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలోని కల్కిదోన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. అర్చకులు కృష్ణస్వామి ఆధ్వర్యంలో సర్పంచ్ వీరేశలింగం దంపతులు క్రతువును జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.


