మరో ముందడుగు.. | - | Sakshi
Sakshi News home page

మరో ముందడుగు..

Feb 26 2026 9:13 AM | Updated on Feb 26 2026 9:13 AM

మరో ముందడుగు..

మరో ముందడుగు..

పరిగిలో పారిశ్రామిక వాడ ఏర్పాటు దిశగా అడుగులు

కాళ్లాపూర్‌, రాపోల్‌ శివారులో భూ సేకరణకు రంగం సిద్ధం

ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసిన సర్కారు

1,197 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్క్‌

వికారాబాద్‌: జిల్లాలో మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దాదాపు 1,100 పైచిలుకు ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. పరిగి మండలం రాపోల్‌, కాళ్లాపూర్‌ రెవెన్యూ గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, పట్టా భూములను సేకరించనున్నారు. ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు 1,197 ఎకరాలు అవసరమని తేల్చారు. ఇందులో 260 ఎకరాల పట్టా భూములు.. 937 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరమని నిర్ణయించారు. కాళ్లాపూర్‌ మండలంలో 159.25 ఎకరాల పట్టా భూమి, 428.05 ఎకరాల ప్రభుత్వ భూమిని.. రాపోల్‌ రెవెన్యూ పరిధిలో పట్టా భూములు 101.08 ఎకరాలు.. 509 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించనున్నారు. ఈ ప్రాంత సమీపం నుంచే ఔటర్‌ రింగ్‌ రోడ్డు, రీజినల్‌ రింగ్‌ రోడ్లను కలుపుతూ రేడియల్‌ రోడ్డు వెళ్లనుంది. మరో వైపు పరిగి – షాద్‌నగర్‌ రోడ్డును రెండు వరుసల నుంచి నాలుగు లేన్లుగా మార్చేందుకు టెండర్‌ ప్రక్రియను పూర్తి చేశారు.

అనుబంధంగా ఏటీఎస్‌

పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు రావాలంటే యువతలో సాంకేతిక నైపుణ్యాలు ఎంతో అవసరంప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు పరిగి మండలం నస్కల్‌ శివారులో ఏటీసీ(అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం రూ.45 కోట్లు వెచ్చించనుంది. ఈ సెంటర్‌ టాటా సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే పలు పారిశ్రామిక వాడలు

జిల్లాలో పలు చోట్ల పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం భూ సేకరణ చేశారు. కొన్ని ప్రారంభం కాగా.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. మోమిన్‌పేట మండలం ఎన్కెతల శివారులో మొబిలిటి వ్యాలి పేరుతో సుమారు వెయ్యి ఎకరాలు సేకరించి రోడ్లు, మౌలిక వసుతులు కల్పిస్తున్నారు. నవాబుపేట మండలం ఆర్కతల గ్రామ శివారులో 250 ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాండూరులోనూ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టగా మధ్యలో ఆగిపోయాయి. కొడంగల్‌ నియోజకవర్గం దుద్యాల్‌ మండలంలో పారిశ్రామిక వాడ పనులు ప్రారంభమయ్యాయి. పూడూరు మండలం రాకంచర్ల సమీపంలో పరిఽశ్రమలు నెలకొల్పారు. వికారాబాద్‌ సమీపంలోని శివారెడ్డి పేట పారిశ్రామిక వాడలో పలు పరిశ్రమలు ప్రారంభమయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement