ఇబ్రహీంపట్నంలో విషాదం
● వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భస్థ శిశువు మృతి
● ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన
ఇబ్రహీంపట్నం: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తల్లిగర్భంలోని శిశువు మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన ప్రకారం.. బాలాపూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన శ్రీహరి భార్య మహేశ్వరి గర్భందాల్చింది. దీంతో ఆమె ఎనిమిది నెలలుగా ఇబ్రహీంపట్నంలోని సాయిహర్ష ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటోంది. మహేశ్వరి ముఖం ఉబ్బుగా ఉందని సోమవారం ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో బీపీ ఎక్కువగా ఉందని ట్యాబ్లెట్ ఇచ్చి పంపించివేశారు. మంగళవారం మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా స్కానింగ్ తీసి నగరంలోని ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో వారు స్థానికంగా ఉన్న మరో ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే శిశువు మృతి చెందిందని తెలిపారు. సాయిహర్ష ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు గర్భంలోనే మృతి చెందిందని శ్రీహరి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు.


