కొబ్బరి పీచు+సింథటిక్‌ కలర్‌= టీ పొడి | - | Sakshi
Sakshi News home page

కొబ్బరి పీచు+సింథటిక్‌ కలర్‌= టీ పొడి

Feb 25 2026 11:35 AM | Updated on Feb 25 2026 11:35 AM

కొబ్బరి పీచు+సింథటిక్‌ కలర్‌= టీ పొడి

కొబ్బరి పీచు+సింథటిక్‌ కలర్‌= టీ పొడి

‘కుటీర పరిశ్రమ’లో తయారు చేసి విక్రయం

స్థానిక హోటళ్లతో పాటు డీలర్లకూ సరఫరా

గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: ఎంపిక చేసుకున్న కొబ్బరిపీచు పొడిలో సింథటిక్‌ కలర్స్‌ కలిపి నకిలీ టీ పొడి తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తికి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెక్‌ చెప్పారు. సనత్‌నగర్‌ పోలీసులతో కలిసి ఫతేనగర్‌లోని ఓ ప్రాంతంపై దాడి చేసి నిందితుడిని పట్టుకున్నట్లు డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ సోమవారం వెల్లడించారు. ఫతేనగర్‌లో నివసిస్తున్న జగన్నాథ్‌ బిష్ణోయ్‌ కొన్నాళ్లుగా టీ పొడి వ్యాపారం చేస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడిని తయారు చేసి విక్రయించడం ప్రారంభించాడు. మార్కెట్‌లో దొరికే కోకో పీట్‌ (కొబ్బరి పీచు పొడి) కొనుగోలు చేసి, అందులోని వ్యర్థాలను తొలగించే వాడు. ఆపై వేడి బెల్లం నీటితో కలిపి రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టేవాడు. ఆ తర్వాత దానికి సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ను కలిపేవాడు. ఈ రంగులను పీల్చుకున్న మిశ్రమాన్ని తిరిగి ఎండబెట్టి, టీ డస్ట్‌ కలిపి గ్రౌండింగ్‌ చేయడం ద్వారా కల్తీ టీ పొడి తయారు చేసే వాడు. ఇతడు తయారు చేసే కిలో కల్తీ టీ పొడిలో 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్‌, 500 గ్రాముల నాణ్యత లేని టీ గ్రాన్యూల్స్‌తో పాటు 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్‌ ఉండేది. ఈ కల్తీ టీ పొడిని అసలైన టీ పొడిగా నమ్మించి స్థానిక టీ స్టాళ్లకు, ఇతర డీలర్లకు భారీ ధరలకు విక్రయిస్తున్నాడు. ఈ విషయంపై వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ యదేందర్‌ నేతృత్వంలో ఎస్సైలు డి.రవిరాజ్‌ తమ బృందంతో కలిసి జగన్నాథ్‌ ఇంటిపై దాడి చేశారు. నిందితుడిని పట్టుకోవడంతో పాటు 120 కిలోల కల్తీ టీ పొడి, 30 కిలోల సాధారణ టీ పొడి, 138 కిలోల కోకోపీట్‌ మిశ్రమం, 800 గ్రాముల సన్‌సెట్‌ కలర్‌, 700 గ్రాములు టార్ర్‌టాజైన్‌ కలర్‌, ఒక్కొక్కటి 500 గ్రాములు బరువున్న 12 బెల్లం బాక్సులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement