సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు
న్యాయం చేయాలని కొహెడ రైతుల వినతి
తుర్కయంజాల్: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడ సర్వే నంబర్ 582లోని రైతులకు న్యాయం చేయాలని మంగళవారం సీఎం ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. తమకు పరిహారం చెల్లించాలని విన్నవించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. కొహెడలోని శావుకారు గుట్ట వద్ద 1992లో 118 మంది రైతులకు ఎకరం చొప్పున భూమిని కేటాయించగా, అప్పటి నుంచి వర్షాధార పంటలను సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇదిలా ఉండగా 2004లో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా అప్పటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ భూములకు చెందిన రైతులు కొందరికి పాసు పుస్తకాలు కూడా పంపిణీ చేశారు. కొన్నాళ్ల తరువాత ఫైరింగ్ రేంజ్‌కు భూమిని కేటాయించడంతో కొందరు రైతులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందింది. కానీ మిగిలిన 63 మందికి న్యాయం చేకూరలేదు. దీంతో బాధితులు అప్పటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నామని పేర్కొన్నారు. అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఒక్కో రైతుకు 300 గజాల చొప్పున ప్లాట్లను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోకపోవడంతో, హైకోర్టును కూడా ఆశ్రయించామన్నారు. 63 మంది రైతులకు ఆరు నెలల్లోగా నష్ట పరిహారం చెల్లించాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వారు కోరారు.


