ఇజ్జత్‌కా సవాల్!
అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోటాపోటీ మున్సిపాలిటీ పీఠం కోసం పావులు ఎలాగైనా ‘చే’జారొద్దని కాంగ్రెస్ అస్త్రశస్త్రాలు కౌన్సిలర్లను కాపాడుకునేందుకుబీఆర్‌ఎస్ కుస్తీపాట్లు
ఇబ్రహీంపట్నం: మున్సిపల్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎలాగైనసరే పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ అన్ని అస్త్రాలకు పదనుపెట్టి ప్రయోగిస్తోంది. పది రోజులుగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మధ్య రాజకీయ చదరంగం నడుస్తోంది. హస్తం పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండడంతో కారు కుదుపులకు గురవుతోంది. ఇప్పటికే ఒకరు కిడ్నాప్ అంటూ అలజడి సృష్టించగా, మిగిలిన వా రిని రక్షించుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో మున్సిపాలిటీలో 24 వార్డులకుగాను బీఆర్‌ఎస్ గెలిచిన 13 కౌన్సిలర్లలో ఆకుల యాదగిరిని మినహాయిస్తే 12 మంది వారికున్నారు. ఒక స్వతంత్ర, మరో బీజేపీ కౌన్సిలర్ మద్దతు కూడగట్టుకోవడంతో ఆ పార్టీ బలం 14కు చేరింది. కేవలం 8 వార్డుల్లో గెలిచిన కాంగ్రెస్‌కు రాష్ట్రంలో అధికారం ఉండడం పెద్ద బలంగా మారింది. ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడు, ఒక బీఆర్‌ఎస్, మరో బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో వారి సంఖ్య 11 వద్దకు వచ్చి ఆగింది. మరో ఇద్దరు కౌన్సిలర్లు అటుఇటైతే మున్సిపల్ పీఠం తలకిందులయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఇద్దరు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లపై ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. వీటి పర్యవసానం ఎలా ఉంటుందో వేచిచూడాలి.
కానరాని కౌన్సిలర్లు
మున్సిపల్ ఫలితాలు వెలువడిన నాటి నుంచి గెలిచిన కౌన్సిలర్ల జాడ కానరాకుండా పోయింది. కాంగ్రెస్ ఆడుతున్న గేమ్‌లో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు చేజారి పోకుండా కారు నేతలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కౌన్సిలర్లు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, వారి ఆరోగ్య పరిస్థితులు, మంచిచెడులు చివరకు కుటుంబసభ్యులకు సైతం సమా చారం ఇవ్వడంలేదని తెలుస్తోంది. ఆకుల యాద గిరి మాదిరి మరో ముప్పు రావొద్దని గులాబీ నేత లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ప్రతిష్టాత్మకంగా మారిన వ్యవహారం
ఇటు కాంగ్రెస్, అటు బీఆర్‌ఎస్‌కు మున్సిపల్ పీఠం ప్రతిష్టాత్మకంగా మారింది. మెజార్టీ కౌన్సిలర్లు గెలిచి చైర్మన్‌గిరి వదులుకుంటే రాజకీయంగా పరువుపోతుందని బీఆర్‌ఎస్.. రాష్ట్రంలో అధికారంలో ఉండి మున్సిపల్ కుర్చీని చేజార్చుకుంటే నియోజకవర్గంలో ఒక మాయని మచ్చలా మిగిలిపోతుందనే భావన కాంగ్రెస్ నేతల్లో ఉంది. తగ్గెదేలేదన్నట్లు ఇరుపక్షాలు అన్ని మార్గాలను అన్వేషిస్తూ పావులు కదుపుతుండంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఎప్పుడనేది వేచిచూడాల్సిందే.
ఏడాది దాటినా అధికారుల పాలనే ..
గత ఏడాది జనవరిలో పాలకవర్గం పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి అధికారుల పాలనలోనే కొనసాగుతోంది. తాజా ఎన్నికలతో కొత్త పాలకవర్గం ఏర్పడి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తారని భావిస్తే గొడవలతోనే గడిచిపోతోంది.
రసకందాయంలో ‘పట్నం’ రాజకీయం


