కేసీఆర్‌ని వెనక్కి తెచ్చుకుందాం | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ని వెనక్కి తెచ్చుకుందాం

Feb 24 2026 9:10 AM | Updated on Feb 24 2026 9:10 AM

కేసీఆర్‌ని వెనక్కి తెచ్చుకుందాం

కేసీఆర్‌ని వెనక్కి తెచ్చుకుందాం

● మాజీ మంత్రి, మహేశ్వరంఎమ్మెల్యే సబితారెడ్డి

శంకర్‌పల్లి: తెలంగాణ రాష్ట్రానికి పూర్వవైభవం రావాలంటే.. సీఎంగా మళ్లీ కేసీఆర్‌ని వెనక్కి తెచ్చుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు హాలులో సోమవారం ఏర్పాటు చేసిన మున్సిపల్‌, మండల పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మున్సిపల్‌ అధ్యక్షుడిగా బద్ధం శశిధర్‌రెడ్డిని నియమించారు. అనంతరం బీజేపీ నుంచి వాసుదేవ్‌ కన్నా, దండు రామ్మోహన్‌, శ్రీకాంత్‌రెడ్డితో పాటు పలువురు ఆమె సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం సబితారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారని, వారిని ఓదార్చడానికి వెళ్తే.. వాళ్లే తనకు ధైర్యం చెప్పడం సంతోషాన్ని కలిగించిందన్నారు. పార్టీ కోసం ఇదే విధంగా కష్టపడి పని చేయాలని, వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అవసరం లేకపోయినప్పటికీ హైడ్రా పేరుతో పేదల నుంచి భూములను గుంజుకుంటోందని ఆరోపించారు. సీఎంకి రంగారెడ్డి జిల్లా భూముల మీద ఉన్న ప్రేమ.. ఈ జిల్లా ప్రజలపై లేదని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని, వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, నాయకులు నారాయణ, గోవర్ధన్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, సత్యనారాయణ, రాజు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement