ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం
షాద్‌నగర్‌రూరల్: రహదారి నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఫ్యూచర్‌సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్‌ఉపాధ్యాయ పిలుపునిచ్చారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని రాయికల్ టోల్‌ప్లాజాలో సోమవారం పోలీసు, ట్రాఫిక్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్‌వ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుభద్రత, డ్రంకెన్ డ్రైవ్ అభయ్‌సారథిపై అవగాహన కల్పించారు. 142 మంది డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శివమ్ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ఒక క్లిష్టమైన సమస్యగా మారిందని, ప్రతిఒక్కరూ వాహనాలను జాగ్రత్తగా నడిపించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణపై ప్రజలందరినీ చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వాహనాలను నడిపే సమయంలో తప్పనిసరిగా రహదారి భద్రత నియమాలు పాటించాలన్నారు. షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలను నడపడంతో ఎంతోమంది ప్రమాదాల బారిన పడి తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపుతామని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ విజయ్‌కుమార్, టోల్‌ప్లాజా ఇన్‌చార్జి ఎస్‌డీ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.


