నిజమైన రైతులకు పరిహారం ఇవ్వాలి
శంకర్‌పల్లి: భూమి కోల్పోతున్న నిజమైన రైతులకు ప్రభుత్వం పరిహార ఫలాలు అందించించాలని సీపీ ఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య కోరా రు. కలెక్టరేట్ వద్ద సోమవారం బాధిత రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని పొన్నగుట్ట తండాకు చెందిన పలువురు గిరిజన రైతులకు ప్రభుత్వం సాగు చేసుకునేందుకు గతంలో అసైన్డ్ పట్టా భూములు కేటాయించింది. అభివృద్ధి, సంక్షేమ పనుల పేరుతో గతంలో ఇచ్చిన భూమిని తిరిగి తీసుకునేందుకు సిద్ధం కాగా.. పట్టా కలిగిన రైతులకు ఎకరాకు 800 గజాల స్థలం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. అసైన్డ్ పట్టా కలిగిన రైతులకు కాకుండా ఇతర వ్యక్తుల పేర్లు అధికారులు రూపొందించిన జాబితాలో ఉన్నాయని, నిజమైన రైతులకు పేర్లు లేవని ఆరోపించారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి, పట్టా ఉన్న రైతులకే 800 గజాల భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింగ్‌రావు, పానుగంటి పర్వతాలు, సుధీర్, బాధిత రైతులు శంకర్, కిషన్, అంబ్రియా, రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.


