వర్షించిన చిరుజల్లులు | - | Sakshi
Sakshi News home page

వర్షించిన చిరుజల్లులు

Feb 24 2026 9:10 AM | Updated on Feb 24 2026 9:10 AM

వర్షి

వర్షించిన చిరుజల్లులు

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు

జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం

తుర్కయంజాల్‌లో కురుస్తున్న వర్షం

ఇబ్రహీంపట్నంలో కురుస్తున్న వాన

సాక్షి, రంగారెడ్డిజిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. మూడున్నర నెలల విరామం తర్వాత సోమవారం జిల్లాలో పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి. మరికొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. నిన్న మొన్నటి వరకు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరికి లోనైన జిల్లా వాసులు అకస్మాత్తుగా కురిసిన ఈ చిరు జల్లులతో ఉపశమనం పొందారు. చేవెళ్ల, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. తుర్కయంజాల్‌ సహా పలు ప్రాంతాల్లో వడగళ్లు కురిశాయి. ఈదురు గాలితో కూడిన వర్షానికి పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడటంతో ఫీడర్లు ట్రిప్పయ్యాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై.. సరఫరాను పునరుద్ధరించారు.

ఆదిబట్లలో భారీ వర్షం

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఆదిబట్లలో భారీ వర్షం కురిసింది. గాలివానతో ఔటర్‌ సమీపంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే దారిలో హోర్డింగ్‌ చినిగిపోయి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కల్గించింది. సుమారు అరగంట పాటు భారీ వర్షం కురవడంతో రోడ్లన్ని జలామయమయ్యాయి.

ఇబ్రహీంపట్నంలో..

ఇబ్రహీంపట్నం: ఇప్పుడిప్పుడే ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం వాతావరణం చల్లబడింది. ఈదురుగాలులతో కూడిన వర్షం ఇబ్రహీంపట్నంలో కురిసింది. గత వారం రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ దశలో గాలులు వీస్తూ చిరుజల్లులతో ఓ మోస్తరు వర్షం కురిసింది.

తెగిపడిన విద్యుత్‌ లైన్‌

తుర్కయంజాల్‌: నిన్నా, మొన్నటి వరకు మండుతున్న ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు అకాల వర్షంతో వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచే మబ్బులతో కూడిన వాతావరణంతో ఉండగా, సాయంత్ర నుంచి ఉరుములు, గాలితో కూడిన వర్షం కురిసింది. సుమారు 5 నిమిషాల పాటు వడగళ్లు పడ్డాయి. మంగళవారం కూడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిబట్ల సర్కిల్‌ డిప్యూటి కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. మన్నెగూడలోని ప్రముఖ్‌ టౌన్‌షిప్‌లో చెట్టు విరిగి విద్యుత్‌ స్తంభంపై పడటంతో లైన్‌ తెగి పడింది. విద్యుత్‌ శాఖ సిబ్బంది అప్రమత్తమై కరెంటు నిలిపివేసి మరమ్మతు చేపట్టారు. గాలివాన కారణంగా పలు చోట్ల ఇబ్బంది తలెత్తినట్లు ఏఈ రవీందర్‌ రెడ్డి తెలిపారు.

వర్షించిన చిరుజల్లులు 1
1/1

వర్షించిన చిరుజల్లులు

Advertisement
 
Advertisement
Advertisement