స్నేహితుడే హంతకుడై.. | - | Sakshi
Sakshi News home page

స్నేహితుడే హంతకుడై..

Feb 24 2026 9:10 AM | Updated on Feb 24 2026 9:10 AM

స్నేహ

స్నేహితుడే హంతకుడై..

● చేతబడి అనుమానంతో వ్యక్తి దారుణ హత్య ● కత్తితో దాడి చేసిన నిందితుడు ● కరన్‌కోట్‌లో విషాదం

తాండూరు రూరల్‌: చేతబడి చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని హత్యచేశాడు. ఈ సంఘటన తాండూరు మండలం కరన్‌కోట్‌లో సోమ వారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాథో డ్‌ వినోద్‌, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని లేబర్‌ కాలనీకి చెందిన మాజీ వార్డు మెంబర్‌ జట్టూరి డప్పు సాయికుమార్‌ (45) ప్రస్తుతం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే సోమవారం తాండూరులో ప్రయాణికులను తీసుకుని గ్రామానికి వస్తున్నాడు. పాత పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఓ హోటల్‌ వద్ద ఇదే ఊరికి చెందిన టైలర్‌ బైండ్ల బాలు ఆటోలో ఉన్న సాయికుమార్‌ను కిందికి లాగి, వెంట తెచ్చుకున్న కత్తి (మా సం నరికే)తో మెడ, తలపైభాగంలో దాడి చేశాడు. ఆ తర్వాత కత్తి పట్టుకుని కొద్దిసేపు ఘటన స్థలంలో హల్‌చల్‌ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన సాయికుమార్‌, బాలు మంచి స్నేహితులు. టైలర్‌గా పనిచేసే బాలు ఇటీవల తన షాపు సరిగ్గా నడవడం లేదని, సాయికుమార్‌ చేతబడి చేయడంతోనే ఈదుస్థితి దాపురించిందని తరచూ స్థానికుల వద్ద ప్రస్తావించేవాడు. అయితే, తన తమ్ముడి కుటుంబ పరిస్థితే బాగో లేదని, నీకెందుకు చేతబడి చేస్తాడని సాయికుమార్‌ సోదరుడు డప్పు నర్సింలు పలుమార్లు బాలుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ మనసులో కక్ష పెంచుకున్న బాలు స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. నిందితుడు బాలు కుటుంబ కలహాల నేపపథ్యంలో ఏడాది క్రితం ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పట్లో సాయికుమార్‌ అతన్ని రక్షించి, ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. ఆపదలో అండగా ఉండి, ప్రాణాం కాపాడిన స్నేహితుడినే చంపడంపై స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాయికుమార్‌ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

స్నేహితుడే హంతకుడై.. 1
1/1

స్నేహితుడే హంతకుడై..

Advertisement
 
Advertisement
Advertisement