మద్యానికి బానిసై వ్యక్తి మృతి
కొందుర్గు: మద్యానికి బానిసై ఓ యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం కొందుర్గులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రేగడిచిల్కమర్రి గ్రామానికి చెందిన బొబ్బని నర్సింలు(38)కి భార్య స్వప్నతోపాటు ముగ్గురు పిల్లలున్నారు. అయితే నర్సింలు మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య స్వప్ప పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి ఆయన విపరీతంగా మద్యం తాగుతున్నాడు. పదిహేను రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయి రాలేడు. సోమవారం తాగిన మైకంలో కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు వెళుతూ అక్కడే పడిపోయాడు. ఇది గమనించిన ఆసుపత్రి సిబ్బంది నర్సింలును పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. జేబులో ఉన్న ఆధార్‌కార్డు పరిశీలించి సమాచారం అందించారు. మృతుడి తండ్రి జంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు సమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


