ఎవరు.. ఎక్కడ
న్యూస్‌రీల్
కమిటీ సిఫార్సులకనుగుణంగా నియామకాలు అప్పటిదాకా ఇబ్బందులు తప్పవు వందరోజుల ప్రణాళిక కార్యాచరణపై ప్రభావం
ఆదివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
మూడు కార్పొరేషన్ల కోసం త్వరలో ‘స్టాఫింగ్ పాటర్న్’
సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి జీహెచ్‌ఎంసీని విభజించి మూడు కార్పొరేషన్లు చేశాక కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లలో అధికారులు, సిబ్బంది సమస్య వెంటాడుతోంది. అన్ని విభాగాల్లో తగినంత మంది అధికారులు, సిబ్బంది లేక పనుల్లో జాప్యం జరుగుతోంది. అసలే బాలారిష్టాల్లో ఉన్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లకు ఇతరత్రా ఇబ్బందులతో పాటు సిబ్బంది లేమి పెద్ద సమస్యగా మారింది. త్వరలో ప్రారంభం కానున్న వందరోజుల ప్రణాళిక కార్యాచరణపై కూడా ఇది ప్రభావం చూపనుంది.
పెరిగిన పని భారం..
ఉమ్మడి జీహెచ్‌ఎంసీలో ఉన్న, విలీనమైన 27 స్థానిక సంస్థలకు చెందిన అధికారులు, సిబ్బందినే మూడు కార్పొరేషన్లకూ సర్దుబాటు చేశారు. దాంతో జీహెచ్‌ఎంసీలో ఖాళీ అయిన వారి స్థానాలను ఇతర అధికారులకు అదనపు బాధ్యతలుగా అప్పగించారు. దీంతో వారి పనిభారం పెరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఏ కార్పొరేషన్‌లో ఎందరుండాలి? స్టాఫింగ్ పాటర్న్ ఎలా ఉండాలి? అనేది తెలుసుకునేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీ సిఫార్సుల కోసం వేచి చూస్తున్నారు.
టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు..
మూడు కార్పొరేషన్ల ఏర్పాటు తర్వాత ఆస్తులు, అప్పుల పంపిణీ, సిబ్బంది విభజన, తదితరమైన వాటిపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేసేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది. మూడు కార్పొరేషన్లకు అవసరమైన అధికారులు, సిబ్బందికి సంబంధించి స్టాఫింగ్ పాటర్న్‌పై కమిటీ సిఫార్సులందాక, ఆ మేరకు సర్దుబాటు చేయడమో, నియామకాలకు ప్రభుత్వం అనుమతించడమో జరగాల్సి ఉంది.
అప్పటిదాకా సర్దుబాటు తప్పనిసరి
టాస్క్‌ఫోర్స్‌కమిటీ సిఫార్సులు అందేవరకు ఉన్నవారితోనే సర్దుబాటు తప్పని పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే కమిటీ నివేదిక అందనున్నట్లు సమాచారం. గతంలో జీహెచ్‌ఎంసీకి అవసరమైన అధికారులు, సిబ్బంది ఎక్కడ ఎందరు అవసరమో తెలిపేందుకు స్టాఫింగ్ పాటర్న్ కోసం అప్పటి ప్రభుత్వం రిటైర్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రసాదరావు కమిటీని నియమించింది. దానిని ఆధారంగా చేసుకునే ప్రస్తుత టాస్క్‌ఫోర్స్ కమిటీ కూడా సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు.
ఎవరు.. ఎక్కడ


