పసిపాపను తెచ్చి ఇవ్వండి
యాచారం: పసి పాపను ప్రాణాలతో తెచ్చివ్వండి.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, తెలిసి తెలియని వైద్యంతోనే శిశువు మృతి చెందడంతో పాటు తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని మండలంలోని మల్కీజ్‌గూడ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల కింద గ్రామానికి చెందిన కల్యాణి పురటినొప్పులతో యాచారం సీహెచ్‌సీకి వస్తే ప్రసవించే సమయంలో పసిపాప మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం జిల్లా అదనపు వైద్యాధికారి లక్ష్మీప్రసన్న యాచారం సీహెచ్‌సీకి చేరుకుని బాధిత మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్కీజ్‌గూడ, యాచారం గ్రామానికి చెందిన పలు రాజకీయ నాయకులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది తెలిసి, తెలియని వైద్య సేవలతో పసిపాప మృతి చెందిందని మండిపడ్డారు. పురటి నొప్పులతో మహిళ ప్రసవం కోసం వస్తే ఆరోగ్య పరిస్థితి అంచనా వేయకుండా ఆస్పత్రి చుట్టూ తిప్పించి తీరా.. అధిక బరువు ఉందని సాకుతో శిశువు మృతి చెందేలా చేశారని సిబ్బందిపై నిప్పులు చెరిగారు. ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు సీహెచ్‌సీకి వచ్చి సముదాయించే యత్నం చేశారు. పసిపాప మృతి చెందడానికి కారణమైన వైద్య సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన జిల్లా అదనపు వైద్యాధికారి లక్ష్మీప్రసన్న వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా వైద్యాధికారి లలితాదేవి కూడా యాచారం సీహెచ్‌సీలో జరిగిన పసిపాప మృతిపై ఫోను చేసి ఆస్పత్రి సూపరెండెంట్ నవీన్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.


