చైర్మన్ ఫలితాన్ని ప్రకటించండి
ఇబ్రహీంపట్నం: మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఫలితాన్ని ప్రకటించి, వెంటనే వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి లింగ్యానాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. చైర్మన్ ఎన్నిక ప్రకటనను అక్రమంగా నిలిపివేశారని, వెంటనే ప్రకటించాలని కోరారు. అలాగే వైస్ చైర్మన్ ఎన్నిక తేదీని ప్రకటించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు విన్నవించారు.
కోర్టులు, కమిషన్ చుట్టూ..
ఇబ్రహీంపట్నం మున్సిపల్ రాజకీయాలు కోర్టులు, ఎన్నికల కమిషన్ చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్‌ఎస్ కౌన్సిలర్ యాదగిరి అపహరణ, 23 వార్డులో కుల ధ్రువీకరణ, 21 వార్డులో మూడు నోట్ల నమోదు తదితర అంశాలు తెరపైకి రావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారాలన్నీ కోర్టులు, ఎన్నికల కమిషన్ చుట్టూ తిరుగుతుండటంతో చైర్మన్ ఎన్నిక సందిగ్ధంలో పడ్డాయి.


