విధులు మరిచి.. చోరులుగా మారి | - | Sakshi
Sakshi News home page

విధులు మరిచి.. చోరులుగా మారి

Feb 22 2026 8:36 AM | Updated on Feb 22 2026 8:36 AM

విధులు మరిచి.. చోరులుగా మారి

విధులు మరిచి.. చోరులుగా మారి

షాద్‌నగర్‌రూరల్‌: రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిని రక్షించే విధులను నిర్వర్తిస్తున్న వారు బంగారం కనిపించగానే చోరులుగా మారారు. ఈ సంఘటన షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం పట్టణ సీఐ విజయ్‌కుమార్‌ వివరాలను వెల్లడించారు. తుర్కయంజాల్‌కు చెందిన గంగిరెడ్డి మధుసూదన్‌రెడ్డి(40), పుల్లగురం పురుషోత్తంరెడ్డి(39) అరుణాచలం క్షేత్రానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ నెల 17న బూర్గుల గేట్‌ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. అప్పుడు విషయం తెలుసుకున్న ఎన్‌హెచ్‌ఎఐ(హైవే పెట్రోలింగ్‌) డ్రైవర్‌ గోద రవికుమార్‌గౌడ్‌, అసిస్టెంట్‌ లోకేశ్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించేందుకు వాహనంలో ఎక్కించే సమయంలో మృతుడు పుల్లగురం పురుషోత్తంరెడ్డి మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగిలించారు. తరువాత ఎవరికై నా విక్రయించి డబ్బులు తీసుకుందామని మాట్లాడుకున్నారు. తరువాత రోజు మృతుడు పురుషోత్తంరెడ్డి సోదరుడు విజయానంద్‌రెడ్డి మార్చురీకి వద్దకు వచ్చి చూడగా మృతదేహంపై బంగారు గొలుసు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. నిందితుల నుంచి రూ.మూడు లక్షల విలువచేసే రెండు తులాల బంగారు గొలుసు, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పట్టణ సీఐ విజయ్‌కుమార్‌, డీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణాధికారి క్రైం ఎస్‌ఐ శివారెడ్డి సిబ్బంది రవీందర్‌, మోహన్‌, కరుణాకర్‌, జాకీర్‌, రాజు కేసును ఛేదించడంలో కీలక పాత్రను పోషించారు.

ఇద్దరి అరెస్టు, రిమాండ్‌కు తరలింపు

Advertisement
 
Advertisement
Advertisement