డీ అడిక్షన్ సెంటర్‌లో యువకుడి మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: డీ అడిక్షన్ కేంద్రంలో చికిత్స పొందుతున్న యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఆదిబట్ల సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. సంతోష్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు బొంగ్లూర్ సమీపంలోని రాఘవేంద్ర హోమ్స్‌లో హైదరాబాద్ డీ అడిక్షన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడకు చెందిన చౌహాన్ సంతోష్ పవన్‌సింగ్ (29) అనే యువ కుడిని ఐదు రోజుల క్రితం ఇక్కడ చేర్పించారు. ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం సంతోష్ తల్లికి ఫోన్ చేసిన నిర్వాహకులు మీ కుమారుడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించామని చెప్పారు. వారు వచ్చేసరికి సంతోష్ చనిపోయాడు. తన కొడుకు శరీరంపై తీవ్రగాయాలు, రక్తపు మరకలు ఉన్నాయని, అతన్ని ఉద్దేశపూర్వకంగా కొట్టి చంపారని మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. అయితే ఇక్కడ కొనసాగుతున్న డీఅడిక్షన్ సెంటర్‌కు ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది.


