చివరి దశకు పనులు
కందుకూరు: ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని విభాగాల అధికారుల పర్యవేక్షణలో పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. సమ్మిట్‌కు గంటల వ్యవధే మిగిలి ఉండటంతో వేగంగా పనులు చేపడుతున్నారు. ప్రధాన వేదిక పనులు పూర్తవగా ఎగ్జిబిషన్ కోసం ఏర్పాటు చేసిన స్టాళ్ల ఏర్పాటు ఫైనల్ పనులు జరుగుతున్నాయి. ప్రధాన వేదిక పక్కనే అతిథులు రాష్ట్ర ప్రగతి తిలకించేలా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన వివరాలు తెలియజేసేలా స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
మీడియా పాయింట్ పరిశీలన
ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా మీడియా సెంటర్ ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ సీహెచ్ ప్రియాంక పరిశీలించారు. జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఆ శాఖ అధికారులు ఉన్నారు.


