వార్డు మెంబర్ అభ్యర్థి అనుమానాస్పద మృతి
కంసాన్‌పల్లిలో భారీ పోలీసు బందోబస్తు
షాద్‌నగర్ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా నామినేషన్ వేసిన అభ్యర్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన మున్సిపల్ పరిధిలోని సోలీపూర్ శివారులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఫరూఖ్‌నగర్ మండలం కంసాన్‌పల్లికి చెందిన శేఖర్(25) వార్డు సభ్యుడిగా నామినేషన్ వేశాడు. బీజేపీ మద్దతుదారుడిగా నామినేషన్ వేసిన శేఖర్‌ను విత్‌డ్రా చేసుకోవాలని అదే గ్రామానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు ఒత్తిడిని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇది తట్టుకోలేక శేఖర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శేఖర్ మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


