నాడు చెత్త ప్రదేశం.. విజ్ఞాన కేంద్రం..
పారిశుద్ధ్య కార్మికుల ఆలోచనకు అధికారుల అభినందన
సాక్షి, సిటీబ్యూరో: అది చెత్త పోగుపడ్డ ప్రదేశం. అక్కడకు వెళ్లాలంటే దుర్గంధం భరించలేక తల్లడిల్లే పరిస్థితి. ఇది ఒకప్పటి దుస్థితి. ప్రస్తుతం అది ప్రశాంత ప్రదేశంగా మారింది. దినపత్రికలు చదువుకునేందుకు అనువైన ప్రాంతంగా రూపాంతరం చెందింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలు చదువుకునేందుకు వీలుగా దినపత్రికలు ఉంచుతున్నారు. చదువుకునేందుకు ప్రశాంత వాతావరణంతో పాటు వివిధ అంశాల గురించి తెలుసుకునేందుకు, స్థానిక ప్రజల మధ్య సత్సంబంధాలకు ఉపకరిస్తోంది. జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌లోని పారిశుధ్య కార్మికులు.. ముఖ్యంగా వారిలో ఒకరైన సుదర్శన్ ప్రయత్నంతో ఈ ప్రాంతం రూపాంతరం చెందింది. ఒక చిన్న ఆలోచన పలు ప్రాంతాలకు స్ఫూర్తిమంతంగా మారడంతో పారిశుధ్యకార్మికుల బృందాన్ని జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఆరోగ్యం–పారిశుధ్యం) సీఎన్ రఘుప్రసాద్ అభినందించారు. పారిశుధ్య కార్మికులు కేవలం ప్రదేశాల్ని శుభ్రం చేయడమే కాక సమాజాన్ని ఆరోగ్యకరంగా మారుస్తున్నారని ప్రశంసించారు.
నాడు చెత్త ప్రదేశం.. విజ్ఞాన కేంద్రం..


