రోడ్డుపై దగ్ధమైన కారు
కడ్తాల్: ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని మక్తమాధారం గేట్ సమీపంలో కడ్తాల్–షాద్‌నగర్ ప్రధాన రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం వెంకటాపూర్ తండాకు చెందిన నలుగురు యువకులు హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో మక్తమాధారం గేట్ సమీపంలోకి చేరుకోగానే కారులో నుంచి పొగలు రావడంతో గమనించారు. వెంటనే కారును నిలిపి అందరూ కిందికి దిగారు. ఒక్కసారిగా మంటలు వ్యాప్తించి కారు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కావొచ్చని స్థానికులు భావిస్తున్నారు.
శేఖర్ మృతికి కారణమైన వారిపై
చర్యలు తీసుకోవాలి
షాద్‌నగర్ రూరల్: అనుమానాస్పద స్ధితిలో మృతి చెందిన ఆవ శేఖర్ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం ముగిశాయి. మంగళవారం రాత్రి షాద్‌నగర్ పరిధిలోని అన్నారం వై జంక్షన్ వద్ద రైలు పట్టాలపై అతని మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మృతుడు కంసాన్‌పల్లిలో వార్డు సభ్యుడిగా నామినేషన్ వేశాడు. కొందరు నాయకులు నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి తేవడంతోనే తన కొడుకు చనిపోయాడని మృతుడి తండ్రి వెంకటయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా శేఖర్ మృతికి కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్ డిమాండ్ చేశారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇదిలా ఉండగా శేఖర్ మృతిచెందడంతో అతని పేరును పోటీ చేసే అభ్యర్థుల జాబితానుంచి తొలగించినట్లు ఎంపీడీఓ బన్సీలాల్ తెలిపారు.
ప్రజాసేవలో పట్లూరి ఫ్యామిలీ
● అరవై ఏళ్లుగా రాజకీయక్షేత్రంలో ఆ కుటుంబం
● ప్రస్తుత బరిలో మూడోతరం అభ్యర్థిని
కేశంపేట: మండలంలోని కొత్తపేటలో ఓ కుటుంబం దాదాపు అరవై ఏళ్లుగా ప్రజలకు రాజకీయ సేవలందిస్తోంది. స్థానిక సంస్థలు ఏర్పాటైన నాటి నుంచి 2006 వరకు పట్లూరి కుటుంబం ప్రజాసేవలో భాగమైంది. గ్రామ మొదటి సర్పంచ్‌గా పట్లూరి శివలింగప్ప ప్రస్థానం ప్రారంభించి పాలనలో తమదైన ముద్ర వేయడంతో ఏళ్లుగా గ్రామస్తులు వారికే పట్టం కట్టారు. 2006 వరకు శివలింగప్ప వారసులు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించగా.. ఆ తరువాత రిజర్వేషన్ మారింది. దీంతో ఆ కుటుంబం మద్దతుతో 2006–2011 వరకు గ్రామ సర్పంచ్‌గా వేరే వారు పనిచేశారు. 2011లో మళ్లీ జనరల్ స్థానంలో పోటీ చేసి ఆ కుటుంబ సభ్యుడైన పట్లూరి జగదీశ్వర్ 2016 వరకు గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. తరువాత గ్రామంలోని సమీకరణాల కారణంగా ఐదేళ్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పట్లూరి జగదీశ్వర్ సతీమణి హైమావతి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గ్రామస్తుల తీర్పుపై మండలవాసులు ఉత్కంఠగా ఉన్నారు.
శంషాబాద్: సిద్ధాంతి బస్తీలో జరిగిన వృద్ధుడి హత్య కేసును ఆర్‌జీఐఏ పోలీసులు ఛేదించారు. ఇన్‌స్పెక్టర్ బాలరాజు తెలిపిన మేరకు.. సిద్ధాంతి బస్తీలోని సౌడయ్య(70) మంగళవారం అర్ధరాత్రి హత్యకు గురై ఉండటంతో భార్యతో పాటు కుటుంబ సభ్యులు ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి స్థానికంగా ఉండే అబ్దుల్ జావేద్(35)తో పాటు ఓ మైనర్ బాలుడి(14)ని అరెస్ట్ చేశారు. వృద్ధుడు తమను తరచూ తిడుతుండటంతో అతడిని అంతమొందించినట్లు నిర్ధారించుకున్నారు. యువకుడిని రిమాండ్‌కు తరలించగా మైనర్ బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నారు.
రోడ్డుపై దగ్ధమైన కారు


