ఆ కుటుంబమంతా ప్రజాప్రతినిధులే
● సింగిల్‌విండో డైరెక్టర్, సర్పంచ్,
ఎంపీటీసీ, ఎంపీపీగా బాధ్యతల నిర్వహణ
● నేడు సర్పంచ్ బరిలోకి..
కడ్తాల్: మండల పరిధిలోని ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన పాలకూర్ల బుగ్గయ్యగౌడ్‌తో పాటు, ఆయన సతీమణి ఉమావతి, బుగ్గయ్యగౌడ్ సోదరుడు వీరయ్యగౌడ్‌లు ప్రజా ప్రతినిధులుగా గ్రామానికి, ఉమ్మడి ఆమనగల్లు మండలానికి అనేక రకాలుగా సేవలందించారు. బుగ్గయ్యగౌడ్ 1987లో సింగిల్‌విండో డైరెక్టర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం 1988లో సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం 1990లో ఆమనగల్లు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల్ మండలాల రైతాంగానికి సేవలందించారు. అనంతరం 1995లో ఎంపీటీసీగా గెలుపొందారు. దీంతో ఆమనగల్లు ఎంపీపీగా బాధ్యతలు చేపట్టడంతో పాటు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడిగా, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్‌గా సేవలందించారు. బుగ్గయ్యగౌడ్ సతీమణి ఉమావతి కూడా ఎక్వాయిపల్లి ఎంపీటీసీగా 2019లో గెలుపొంది 2024 వరకు గ్రామాభివృద్ధికి సేవలందించారు. బుగ్గయ్యగౌడ్ సోదరుడు వీరయ్యగౌడ్ కూడా 1995లో ఎక్వాయిపల్లి సర్పంచ్‌గా సేవలందించారు. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో బుగ్గయ్యగౌడ్ పెద్ద కుమారుడు పాలకూర్ల కరుణాకర్‌గౌడ్ ఎక్వాయిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. చిన్న కుమారుడు రవికాంత్‌గౌడ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.


