భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు
మొయినాబాద్: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను హత్యచేసిన భర్తకు జీవిత ఖైదు శిక్ష పడింది. మొయినాబాద్‌లో 2023లో జరిగిన ఈ హత్యకేసును విచారించిన ఎనిమిదో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెలువరిచింది. హంతకుడికి జీవిత ఖైదుతోపాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ కుటుంబం 2023కు ముందు బతుకుదెరువు నిమిత్తం మొయినాబాద్‌కు వలస వచ్చింది. పట్టణ సమీపంలో గుడిసెలు వేసుకుని ఉంటూ కూలీ పనిచేసేవారు. 2023 ఫిబ్రవరి 20న హుస్సేన్ మద్యానికి రూ.80 ఇవ్వాలని భార్య హుస్సేన్‌బీని అడిగాడు. తన వద్ద లేవని ఆమె చెప్పడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిందితుడు కర్రతో కొట్టాడు. వదినపై దాడిని అడ్డుకోబోయిన తన సోదరి సఫియా బేగంను నెట్టేసి.. హుస్సేన్‌బీని గుడిసెలోకి లాక్కెళ్లాడు. అనంతరం రుబ్బురోలు, రాయితో ఛాతి, ముఖంపై కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటి మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ డీకే లక్ష్మీరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కీలక ఆధారాలు సేకరించి నిందితున్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఎల్‌బీనగర్‌లోని ఎనిమిదో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు కేసు విచారణ చేపట్టింది. వాదనలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడైన మహ్మద్ హుస్సేన్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించారు.
అల్లర్లు సృష్టిస్తే రూ.లక్ష జరిమానా
తహసీల్దార్ గాయత్రి
దౌల్తాబాద్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, బీఆర్‌ఎస్ నాయకులు బాల్‌రాజు, అశోక్‌ను మంగళవారం పోలీసులు తహసీల్దార్ ఎదుట బరైండోవర్ చేశారు. గ్రామాల్లో శాంతిభధ్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించేదిలేదని తహసీల్దార్ గాయత్రి హెచ్చరించారు. ప్రచారంలో అల్లర్లు, గొడవలు సృష్టించినా అరెస్టుతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తామని తెలిపారు.


