లారీ కింద పడి యువకుడి దుర్మరణం
శంకర్‌పల్లి: లారీ కింద పడిన ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన సోమవారం రాత్రి మోకిల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శుభం హల్సే(22) ప్రైవేటు ఉద్యోగి. తన తల్లిదండ్రులతో కలిసి నగరంలోని దూల్‌పేట్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం విధులు ముగించుకొని బైక్‌పై కొల్లూర్ వైపు వెళ్తుండగా.. ఇంద్రారెడ్డినగర్ వద్ద పక్కపక్కనే వెళ్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. శుభం హల్సే అక్కడే కింద పడిపోగా.. వెనక నుంచి వచ్చిన లారీ అతని పైనుంచి వెళ్లింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.


