ఎస్టీపీ నిర్మాణం చేపట్టొద్దు
అబ్దుల్లాపూర్‌మెట్ : పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘం కేంద్రంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సోమవారం ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్) నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దండెం రాజశేఖర్‌రెడ్డి కాలనీవాసులతో కలిసి ప్లాంట్ నిర్మాణ పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేసి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు ఉదయమే మున్సిపల్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు పండుగుల జయశ్రీరాజు, మాజీ వైస్ చైర్మన్ సిద్దెంకి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ యూత్ నాయకుడు పాలడుగు నాగార్జున, బీజేపీ నాయకులు పిల్లి శ్రీనివాస్, చంటి, బీఆర్‌ఎస్ నేత దండెం రాంరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్ద అంబర్‌పేట సర్వేనంబర్ 292లో 3 ఎకరాల విస్తీర్ణంలో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయడం అన్యాయమని అన్నారు. హైడ్రా ద్వారా చెరువులు, కుంటలు కాపాడుతుండగా ఇక్కడ మాత్రం చెరువు భూమిలో ఎస్టీపీ ప్లాంట్ చేపట్టడం సరికాదన్నారు. ఎస్టీపీ నిర్మాణంతో భూగర్భ జలాలు సైతం పూర్తిగా కలుషితమయ్యే అవకాశాలున్నాయని, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతీంటాయని అన్నారు. నిర్మాణ పనులను అధికారులు విరమించుకోవాలని, నివాస ప్రాంతాలకు దూరంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. పెద్దఅంబర్‌పేట నుంచి తరలించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
వ్యతిరేకించిన నేతలు
అరెస్టు చేసిన పోలీసులు


