పంచాయతీ ఎన్నికలకు
పకడ్బందీ ఏర్పాట్లు
ఇబ్రహీంపట్నం రూరల్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, మకరంద్ మంద ఐఏఎస్ వివిధ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా, మండల స్థాయిల్లో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు రాండమైజేషన్ ద్వారా సిబ్బందికి అవసరమైన బ్యాలెట్ బాక్సులు కేటాయించడం జరిగిందని, విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. స్వేచ్ఛాయుత వాతవరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ.. పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతవరణంలో జరిగేలా ఆయా శాఖల సిబ్బంది, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, సీపీఓ సౌమ్య, జిల్లా ఆడిట్ అధికారి వెంకట్‌రెడ్డి, డీఎం సివిల్ సప్లయ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి


