పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదాం
శంకర్‌పల్లి: దేశంలోని ప్రతి పౌరుడిపై పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని ఎన్‌డీఎంఏ మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని దొంతాన్‌పల్లి ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు సాగనున్న ‘మోడల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్’ కార్యక్రమాన్ని ఆయన ప్రముఖ పర్యావరణ, విద్యావేత్త ప్రొ.పురుషోత్తం రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ఒక వైపు చదువుపై దృష్టి సారిస్తూనే మరో వైపు పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. వినూత్న ఆవిష్కరణలు చేసి, పర్యావరణాన్ని పరిశుభ్రం చేయాలని, విరివిగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రొ.పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణం కోసం ఇక్ఫాయ్ కళాశాల చేస్తున్న కృషిని కొనియాడారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డీన్ డా.అరుణ్ కుమార్, డైరెక్టర్ ప్రొ.రవిశేఖర రాజు, కో–ఆర్డినేటర్ డి.వి.ఎన్ మూర్తి, ప్రొ.రాకేశ్, ప్రొ.అక్బర్, ప్రొ.హేమలత తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి


