అదరం.. బెదరం! | - | Sakshi
Sakshi News home page

అదరం.. బెదరం!

Oct 13 2025 9:06 AM | Updated on Oct 13 2025 9:06 AM

అదరం.. బెదరం!

అదరం.. బెదరం!

కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసినా..

ఏసీబీ కేసులకు వెరవని అక్రమార్కులు

డిస్కంలో వరుసగా పట్టుపడుతున్న ఇంజనీర్లు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొత్తలైన్లు, లైన్‌ షిఫ్టింగ్‌ పనులు, మీటర్లు, డీటీఆర్‌లు, ప్యానల్‌ బోర్డులు కరెంటోళ్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. నిబంధనల మేరకు లోడును బట్టి ఫీజులు చెల్లిస్తున్నా.. క్షేత్రస్థాయిలోని ఆర్టిజన్లు, జూనియర్‌ లైన్‌మెన్లు, ఏఈ, ఏడీఈ, డీఈ, చివరకు ఎస్‌ఈలు.. ఇలా ఎవరి స్థాయిలో వారికి చేయి తడపనిదే పని కావడం లేదు. నిరాకరించిన వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. అధికారుల తీరుతో విసుగు చెందిన వినియోగదారులు చివరకు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ప్రతి నెలా ఎవరో ఒకరు ఏసీబీకి పట్టుబడుతూనే ఉన్నారు. అయినా.. అక్రమార్కుల వైఖరిలో మాత్రం మార్పురావడం లేదు. నిజానికి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో పోలిస్తే డిస్కం ఇంజనీర్ల వేతనాలు చాలా ఎక్కువే. ఒక్కో డీఈకి సీనియార్టీని బట్టి నెలకు రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు వేతనం చెల్లిస్తుంది. సీనియర్‌ లైన్‌మెన్‌, లైన్‌ ఇన్స్‌పెక్టర్ల వేతనాలు సైతం రూ.లక్షకు పైమాటే. ప్రభుత్వం వీరికి భారీగా వేతనాలు చెల్లి స్తున్నప్పటికీ.. వీరిలో కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్‌ చేస్తున్నారు. అడిగినంత ముట్టజెప్పితే సరి..లేదంటే కొర్రీలు పెట్టి ముప్పు తిప్పలు పెడుతుంటారు. ఎక్కడా లేని విధంగా ఫోకల్‌, నాన్‌ ఫోకల్‌ అనే పేరుతో పోస్టులను సృష్టించి పోస్టింగ్‌ కోసం చేసిన ఖర్చులను తిరిగి రాబట్టుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమ సంపాదనకు అలవాటుపడి అవినీతి నిరోధకశాఖ వలలో చిక్కుకుంటున్నారు. అరైస్టె జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత అంతకంటే పెద్ద పోస్టుల్లో చేరి, మళ్లీ అదే తంతు కొనసాగించడం విస్మయం కలిగిస్తోంది.

సర్కిల్‌ ఆఫీసుల్లోనూ అక్రమార్కుల తిష్టః

హైదరాబాద్‌ సౌత్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌, బంజారాహిల్స్‌ సర్కిళ్లు, డివిజన్లు, సబ్‌ డివిజన్లు, సెక్షన్ల పరిధిలో ఇప్పటికే నిర్మాణాలు పూర్తయ్యాయి. కొత్త కనెక్షన్లకు ఎస్టిమేషన్లు సైతం ఉండవు. దీంతో ఆశించిన స్థాయిలో అదనపు ఆదాయం సమకూరదు. ఆయా డివిజన్లు, సబ్‌డివిజన్లు, సెక్షన్లలో పోస్టులకు ఇంజనీర్లు పనిచేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. శివారులోని మేడ్చల్‌, సైబర్‌సిటీ, సరూర్‌నగర్‌, రాజేంద్రనగర్‌ సర్కిళ్లలో హైరైజ్‌ భవనాలు, మల్టీ స్టోరేజ్‌ బిల్డింగ్స్‌, ఐటీ అనుబంధ సంస్థలు, పారిశ్రామిక వాడలు ఎక్కువ. ఇక్కడ పోస్టుల కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. ఆ తర్వాత అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారు. కేవలం క్షేత్రస్థాయిలోని ఆర్టిజన్లు, ఏఈలు, ఏడీఈలు మాత్రమే కాదు సైబర్‌సిటీ, రాజేంద్రనగర్‌, మేడ్చల్‌ సర్కిల్‌ ఆఫీసుల్లోని కీలక అధికారులు సైతం ఒక్కో ఫైలుకు ఒక్కో రేటు నిర్ణయించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.

మచ్చుకు కొన్ని ఏసీబీ కేసులు

● అదనపు లోడు కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వినియోగదారుడి నుంచి లాలాగూడ సెక్షన్‌ ఇన్‌చార్జి ఏఈ భూమిరెడ్డి సుధాకర్‌రెడ్డి రూ.15 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

● ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంబాగ్‌ డివిజన్‌ ఏడీఈ అంబేడ్కర్‌ ఇప్పటికే ఏసీబీ కేసులో జైలుకు వెళ్లారు. ఆయనకు బినామీగా వ్యవహరించినట్లు ఆరోపణలున్న చేవెళ్ల ఏడీఈ రాజేశ్‌పై సైతం ఇటీవలే ఏసీబీ కేసు నమోయింది.

● గోపన్‌పల్లిలోని ఓ నిర్మాణంలో ఉన్న భవనానికి విద్యుత్‌ మీటర్‌ మంజూరు కోసం రూ.50 డిమాండ్‌ చేసి గచ్చిబౌలి డివిజన్‌ ఏడీఈ సతీశ్‌ ఏసీబీకి చిక్కారు. ఆయన వంద కోట్లకుపైగా ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు.

● విద్యుత్‌శాఖ గోల్నాక సెక్షన్‌ జూనియర్‌ లైన్‌మెన్‌ శివమల్లేష్‌ కమర్షియల్‌ మీటర్‌ కనెక్షన్‌ కోసం రూ.30 వేలు తీసుకుంటూ దొరికిపోయారు.

● మంచాల మండలంలోని ఓ వెంచర్‌లో రోడ్డుకు అడ్డుగా ఉన్న 11 కేవీ, 33 కేవీ లైన్ల మార్పునకు, నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరుకు సరూర్‌నగర్‌ సర్కిల్‌ ఎలక్ట్రికల్‌ (టెక్నికల్‌) డివిజనల్‌ ఇంజనీర్‌ (డీఈ) టి.రాంమ్మోహన్‌ డబ్బులు డిమాండ్‌ చేసి, సదరు కాంట్రాక్టర్‌ నుంచి రూ.18 వేలు తీసుకుంటూ ఇటీవల ఏసీబీకి పట్టుబడిన విషయం సంచలనం సృష్టిచింది.

వ్యవస్థాగతంగా వేళ్లూనుకున్న అవినీతి, అక్రమ వసూళ్లను పూర్తిగా నియంత్రించి, పారదర్శకుతకు పెద్దపీట వేసేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఇటీవల అందుబాటులోకి తెచ్చిన కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొత్త విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు అంచనాలు రూపొందించడం మొదలు కనెక్షన్లు, మీటర్లు, ప్యానల్‌ బోర్డులు, డీటీఆర్‌ల మంజూరీ, లైన్‌ షిఫ్టింగ్‌ వర్కుల వరకు ఇలా ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి క్షేత్ర స్థాయిలోని ఆర్టిజన్లు, జూనియర్‌ లైన్‌మెన్లు, ఏఈలు, ఏడీఈలు, డీఈలు ఇలా ఎవరి స్థాయిలో వారు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అవినీతి నిర్మూలన, పనుల్లో పారదర్శకత కోసం సీఎండీ ముషారఫ్‌ అలీ ఇటీవల 040–23454884, 7680901912 ఫోన్‌ నంబర్లుతో ప్రత్యేక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు పోస్టర్లు ముద్రించి, ఆ మేరకు గ్రేటర్‌ వ్యాప్తంగా ఉన్న అన్ని సెక్షన్లు, ఈఆర్‌ఓ కేంద్రాలు, సబ్‌స్టేషన్లలోనూ అతికించింది. ఇప్పటికే 60కిపైగా ఫిర్యాదులు అందాయి. అక్రమ వసూళ్లు, విధినిర్వహణలో నిర్లక్ష్యానికి పాల్పడిన 19 మంది ఇంజనీర్లపై అంతర్గత విచారణ చేపట్టి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అయినా క్షేత్రస్థాయిలోని కొంత మంది అక్ర మార్కుల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement