
నేడు, రేపు కూడా పల్స్ పోలియో
పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం తొలి రోజు విజయవంతమైందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఉదయం బండ్లగూడ జాగీర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారికి పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి రోజు చుక్కలు వేయించుకోని వారికి ఇంటింటి పర్యటనలో భాగంగా సోమ, మంగళవారాల్లో చుక్కల మందు వేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశ వ్యాప్తంగా 290 జిల్లాల్లో, తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో ఈ పోలియో నిర్మూలన ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. జిల్లాలో 4,20,911 మంది ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి, వారికి ఉచితంగా పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ లలితాదేవి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నామినేషన్ల స్వీకరణ నేటి నుంచే..
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి సోమవారం ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇదే రోజు నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు.
నామినేషన్ల స్వీకరణకు అంతా సిద్ధం..
షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ ఆర్వో కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లపై ఆర్వో, ఏఆర్‌ఓలతో సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఈఎస్‌ఐ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి సాయిరాంనకు సూచించారు.