
ట్రిపుల్‌ఆర్‌పై గందరగోళం వద్దు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త నగరాలు, రహదారులు, మౌలిక సదుపాయాలకు రూపకల్పన జరుగుతుంది. అందులో రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) కూడా ఒకటి. ప్రభుత్వం తమ ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టింది. ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పటికీ చర్చల దశలోనే ఉన్న ఈ రోడ్డుపై కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జిల్లా ప్రజలను, రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ విడుదల చేసిన అనధికారిక అలైన్‌మెంట్(పాత)ను మార్చి, కొత్త అలైన్‌మెంట్ రూపొందిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. నిజానికి పాత అలైన్‌మెంట్ అనేది ఒక ఊహాజనితం మాత్రమే. భూసేకరణ విషయంలో రైతులను తప్పు దోవ పట్టించొద్దు’ అని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను, వాటి పరిణామాలను ఆయన మాటల్లోనే...
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు మాత్రమే ఫైనల్
రావిర్యాల ఎగ్జిట్ 13 నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు అటు నుంచి ఆమనగల్లు వరకు ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశాం. తొలి విడతలో రావిర్యాల ఎగ్జిట్ నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు ఉన్న 20 కిలోమీటర్లు రోడ్డుకు 449 ఎకరాలు, రెండో విడతలో మీర్‌ఖాన్‌పేట వరకు అటు నుంచి ఆమనగల్లు వరకు 21.5 కిలోమీటర్ల రోడ్డుకు 554.35 ఎకరాలు భూమి అవసరమైంది. ఆ మేరకు మొత్తం 4,725 మంది రైతుల నుంచి 1004.22 ఎకరాలు సమీకరించాం. భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి అవార్డును పాస్ చేశాం. భూములు ఇచ్చేందుకు నిరాకరించిన కొంత మంది రైతులకు సంబంధించిన మొత్తాన్ని అథారిటీలో జమ చేశాం. ఇక్కడ ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదు. టెండర్లు కూడా ఖరారయ్యాయి.
ఓ కొలిక్కి వచ్చిన బీజాపూర్ రహదారి
బీజాపూర్ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. దీంతో ప్రభుత్వం అప్పా టు మన్నెగూడ వరకు(46.405 కిలోమీటర్లు) రోడ్డును రెండు వైపులా 60 మీటర్ల వరకు విస్తరించాలని నిర్ణయించింది. ఆ మేరకు రూ.928.41 కోట్లు ఖర్చు సహా 266.55 హెక్టార్ల భూమి అవసరం ఉన్నట్లు గుర్తించింది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అయితే రోడ్డుకు ఇరు వైపులా ఉన్న 60 నుంచి 80 ఏళ్ల వయసున్న 915 మర్రి వృక్షాలను తొలగించాల్సి రావడంపై కొంత మంది పర్యావరణ వేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పురాతన మర్రి చెట్ల ఉనికి దెబ్బతినకుండా మధ్యేమార్గంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే రెడ్ మార్క్ వేసిన 150 వృక్షాలు మినహా మిగిలిన వాటిని సర్వీసు రోడ్డుకు, ప్రధాన క్యారేజ్‌వేకు మధ్యలో ఉండేలా స్వల్ప మార్పులు చేపట్టారు. ఇప్పటికే మొయినాబాద్, చేవెళ్ల బైపాస్‌రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి.
నాలుగు వేల అర్జీలు క్లియర్ చేశాం
రెవెన్యూ సదస్సుల్లో భాగంగా 21 వేలకుపైగా అర్జీలు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, బాధితులకు నోటిసులు జారీ చేశాం. క్షేత్రస్థాయి నుంచి రిపోర్టులు తెప్పించుకుని ఇప్పటికప్పుడు వాటిని క్లియర్ చేసేందుకు యత్నిస్తున్నాం. రోజుకు సగటున 50 నుంచి 60 దరఖాస్తులను పరిష్కరిస్తున్నాం. ఇప్పటి వరకు నాలుగు వేలకుపైగా దరఖాస్తులను క్లియర్ చేశాం. ధరణి పోర్టల్‌లో దొర్లిన తప్పిదాలకు ‘భూభారతి’లో అవకాశం ఇవ్వడం లేదు. భూ భారతి పోర్టల్‌తో అన్ని సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది.
రైతులను తప్పుదారి పట్టించొద్దు
పాత అలైన్‌మెంట్
ఓ కన్సల్టెన్సీ ఊహాజనితమే
భూ భారతితోనే భూములకు పూర్తి రక్షణ
‘సాక్షి’తో కలెక్టర్ నారాయణరెడ్డి
ఇంకా ప్రతిపాదనల దశలోనే
నగరంపై ఒత్తిడి తగ్గించేందుకు ఔటర్ మాదిరిగా మరో రింగు రోడ్డు అవసరం ఉందని ప్రజలతో పాటు ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తైతే జిల్లా రూపు రేఖలే మారబోతున్నాయి. భూముల ధరలు పెరిగి, రియల్ ఎస్టేట్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది. ఈ రోడ్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇది ప్రభుత్వ ప్రతిపాదన మాత్రమే. ఎక్కడ నివాసాలు ఉన్నాయి? ఎక్కడ చెరువు ఉంది? ఎక్కడ బఫర్ జోన్ ఉంది? ఎక్కడ విల్లాలు ఉన్నాయో? స్పష్టత రాలేదు. రోడ్లు భవనాల శాఖ తుది రిపోర్టు తర్వాతే రెవెన్యూశాఖ భూసేకరణ ప్రక్రియను చేపడుతుంది. అయితే ప్రభుత్వ ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంలో కొంత మంది త్యాగం చేయక తప్పదు. రైతులు అనవసరంగా ఆందోళన చెందొద్దు.