ఆర్థిక సమస్యలతో యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక సమస్యలతో యువకుడి ఆత్మహత్య

Sep 15 2025 9:19 AM | Updated on Sep 15 2025 9:19 AM

ఆర్థిక సమస్యలతో యువకుడి ఆత్మహత్య

ఆర్థిక సమస్యలతో యువకుడి ఆత్మహత్య

అబ్దుల్లాపూర్‌మెట్‌: ఆర్థిక సమస్యల కారణంగా చెట్టుకు ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్‌ జిల్లాకు చెందిన చెందిన సుబ్రత్‌ జైన్‌కు భార్య, ఇద్దరు కుమారులతో కలిసి మండలంలోని కవాడిపల్లిలో నివాసముంటున్నాడు. అతని పెద్దకుమారుడు సుకమోల్‌ జైన్‌(20) గ్రామ శివారులోని జీఎస్‌పీ ఇండస్ట్రీస్‌లో పనిచేస్తున్నాడు. అతడు ఆదివారం ఉదయం బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. కాసేపటికే సుకమోల్‌తో పనిచేసే యువకుడు సుబ్రత్‌ జైన్‌కు ఫోన్‌చేసి మీ కుమారుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. దీంతో సంఘటనా స్థలానికి వెళ్లి బోరున విలపించాడు. తన కుమారుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

సినీ నటుడిని బెదిరిస్తున్న యువతిపై కేసు

బంజారాహిల్స్‌: ఏఐ టెక్నాలజీతో ఓ బాలీవుడ్‌ నటుడి ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్‌ చేస్తూ ఆయన స్నేహితులకు, దర్శక, నిర్మాతలకు, కుటుంబ సభ్యులకు పోస్ట్‌ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న యువతిపై బంజారాహిల్స్‌లో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముంబై నివాసి, ఫ్రీలాన్స్‌ నటుడు ఆనంద సురేష్‌ కుమార్‌ రెన్వా (36)ను జియా ఉనిస్సా నస్రీన్‌ అనే మహిళ మూడు సంవత్సరాలుగా నిరంతరం వేధిస్తోంది. అతని ఇన్‌స్ట్రాగామ్‌, వాట్సప్‌, ఫోన్‌ అకౌంట్స్‌ హ్యాక్‌ చేసి, అతని పేరుతో ఏఐ ద్వారా మార్ఫింగ్‌ చేసిన సెమీ న్యూడ్‌, న్యూడ్‌ ఫోటోలు, వీడియోలు సృష్టించింది. ఆ మార్ఫింగ్‌ ఫోటోలు, వీడియోలను పరిశ్రమలోని దర్శకులకు, రెండు ప్రొడక్షన్‌ హౌస్‌లకు పంపించి అరాచకానికి పాల్పడిందని, ఈ కారణంగా తన వృత్తిపై తీవ్ర ప్రభావం చూపిందంటూ బాధిత నటుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాదాపు 15 నుంచి 20 నకిలీ ఖాతాల ద్వారా అతన్ని అవమానపరిచేలా పలు సందేశాలను, వీడియోలను పంపింది. అతని కుటుంబాన్ని లక్ష్యంగా చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడిందని, హృద్రోగ లక్షణాలు కూడా వచ్చాయని బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా అతని సోదరికి కూడా అశ్లీల సందేశాలు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆనంద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జింఖానా క్లబ్‌ చైర్మన్‌గా శివరామకృష్ణ

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌లోని ది హైదరాబాద్‌ జింఖానా క్లబ్‌ చైర్మన్‌గా గూడురు శివరామకృష్ణ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన క్లబ్‌ ఎన్నికల్లో నాగ కిషోర్‌ ప్యానెల్‌ ఘన విజయం సాధించింది. చైర్మన్‌గా గూడురు శివరామకృష్ణ, వైస్‌ చైర్మన్‌గా ఎస్‌.మధుసూదన్‌రెడ్డి, సెక్రటరీగా ఎన్‌.నాగ కిషోర్‌, జాయింట్‌ సెక్రటరీగా వెన్నం అనిల్‌రెడ్డి, ట్రెజరర్‌గా గడ్డిపాటి హరీష్‌, డైరెక్టర్లుగా కనుమూరి నారాయణరాజు, రఘురామ్‌, కంజర్ల సదాశివయాదవ్‌, కంటిపూడి శ్రీనివాస్‌చౌదరి, అత్తలూరి సుధీర్‌కుమార్‌, రవికుమార్‌ వడ్లమూడి విజయం సాధించారు. మొత్తం 2064 ఓట్లకు గాను 1420 ఓట్లు పోలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement