
కార్యాలయానికి స్థలం కేటాయించండి
మీర్‌పేట: తెలంగాణ మాజీ కేంద్ర సాయుధ పోలీస్ ఫోర్సెస్ సిబ్బంది సంక్షేమ సంఘం కార్యాలయానికి స్థలం కేటాయించాలని ఆదివారం సంఘం సభ్యులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కె.శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో దాదాపు 1,500 పారామిలిటరీ కుటుంబాలు నివసిస్తున్నాయని, గతంలో పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీంతో పాటు పక్కనున్న బడంగ్‌పేట కార్పొరేషన్‌లో మాజీ పారామిలిటరీ సిబ్బంది కుటుంబాలకు ఆస్తిపన్ను రద్దు వర్తింపజేస్తున్నప్పటికీ మీర్‌పేట ప్రాంతంలో మాత్రం వసూలు చేస్తున్నారని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లు దేశ సేవ చేసిన పారా మిలిటరీ బలగాల సంక్షేమానికి కుట్టుబడి ఉన్నానని, త్వరలోనే కుర్మల్‌గూడ ప్రాంతంలో స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు మీర్‌పేట కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఇంటి పన్నును రద్దును వర్తింపజేయాలని సూచించారు. కార్యక్రమంలో యాదగిరిరెడ్డి, యాదయ్య, రాజారత్నం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సబితారెడ్డిని కోరిన మాజీ పారా మిలిటరీ సిబ్బంది సంఘం