
గుర్తు తెలియని వ్యక్తిమృతదేహం లభ్యం
ఇబ్రహీంపట్నం రూరల్: ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. ఆదిబట్లలోని టీసీఎస్ పక్కన ఉన్న మిలన్ డ్రైవ్ హోటల్ ముందు ఆదివారం ఓ గుర్తు తెలియని మృతదేహం పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వచ్చి పరిశీలించే సరికి మృతి చెందిన వ్యక్తి భిక్షాటన చేసే వ్యక్తిగా గుర్తించారు. వయసు దాదాపు 55 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
అమ్మను ఎందుకు కొడుతున్నావని ప్రశ్న..
కుమారుడిపై తండ్రి హత్యాయత్నం
ఫిలింనగర్: అమ్మను ఎందుకు కొడుతున్నావమని ప్రశ్నించిన కుమారుడిపై తండ్రి కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్‌లోని దీన్‌దయాళ్‌నగర్ బస్తీలో నివసించే అల్లం నర్సింహ్మ రోజూ పీకలదాకా మద్యం తాగి ఇంటికి వస్తూ భార్యపై అనుమానం పెంచుకుంటూ ఆమెను తీవ్రంగా కొడుతుండేవాడు. ప్రతిరోజూ భార్యను అనుమానించడమే కాకుండా తాగిన మైకంలో ఆమెను కొడుతుండడంతో ఇదేమి పద్ధతి అని కుమారుడు సురేష్ పలుమార్లు తండ్రిని నిలదీయగా అతన్ని కూడా కొట్టేవాడు. శనివారం రాత్రి మద్యం మత్తులో భార్యపై దాడి చేసి తీవ్రంగా కొట్టగా సురేశ్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో నర్సింహ్మ జేబులో ఉన్న కత్తి తీసి కొడుకు మెడను కోశాడు. తీవ్ర రక్తస్రావం మధ్య సురేష్‌ను అపోలో హాస్పటల్‌లో చికిత్స నిమిత్తం చేర్చారు. మెడకు తీవ్రంగా గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు. తనతో పాటు తల్లిపై హత్యాయత్నానికి పాల్పడిన తండ్రిపై చర్యలు తీసుకోవాలంటూ సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.