
పాకిస్తానీ ఫొటోతో ‘పని’ కానిచ్చారు!
సాక్షి, సిటీబ్యూరో: ఇన్‌స్ట్రాగామ్ ఐడీ ‘ఖూబ్‌సూరత్.రిస్తే’లో పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబర్, ఇన్‌ఫ్ల్యూయెన్సర్ పర్వా షా ఫొటో పోస్టు చేసి పెళ్లి ప్రతిపాదనలతో నగరవాసిని మోసం చేసి ఇద్దరు బిజాపూర్ కిలేడీలు రూ.25 లక్షలు కాజేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ మహిళతో పాటు సహకరించిన హైదరాబాదీని అరెస్టు చేసినట్లు డీసీపీ దార కవిత శుక్రవారం ప్రకటించారు. కర్ణాటకలోని బిజాపూర్‌కు చెందిన అనీసా మహ్మద్యసీన్ హుండేకర్, జోహార్ ఫాతిమా తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం మాట్రిమోనియల్ ఫ్రాడ్స్ చేయాలని పథకం వేశారు. ఈ మేరకు 2023లో ఇన్‌స్ట్రాగామ్‌లో ఖూబ్‌సూరత్.రిస్తే పేరుతో ఓ ఐడీ క్రియేట్ చేశారు. ఇందులో పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబర్ పర్వా షా ఫొటోలు పోస్టు చేశారు. ఇవి తనవే అన్నట్లు అనీసా తన ఫోన్ నెంబర్ పోస్టు చేసింది. ఆ ఏడాది మార్చిలో ఈ ప్రొఫైల్ చూసిన నగర వాసి సంప్రదించి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. వివాహం చేసుకోవడానికి అంగీకరించిన అనీసా అతడితో మాట్లాడింది. ప్రత్యేక యాప్ ద్వారా పర్వా షానే మాట్లాడుతున్నట్లు వీడియో కాల్స్ కూడా చేసింది. ఆపై వైద్యం సహా వివిధ అత్యవసర అవసరాల పేరు చెప్తూ నగరవాసి నుంచి డబ్బు తీసుకోవడం ప్రారంభించింది. ఈ వ్యవహారంలో ఫాతిమా సైతం సహకరించింది. వీరికి పరిచయస్తుడైన హైదరాబాదీ మహ్మద్ అబ్దుల్ అమీర్ కమీషన్ ప్రాతిపదికన తన బ్యాంక్ ఖాతా వివరాలు అందించాడు. ఇందులోనూ బాధితుడు కొంత మొత్తం డిపాజిట్ చేశాడు. ఎట్టకేలకు తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏసీపీ ఆర్‌జీ శివమారుతి నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ కె.ప్రసాదరావు నేతృత్వంలోని బృందం ఈ కేసు దర్యాప్తు చేసింది. అమీర్‌తో పాటు అమీసాను అరెస్టు చేసి వీరి నుంచి ల్యాప్‌టాప్, ట్యాబ్, ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న ఫాతిమా కోసం గాలిస్తోంది.
ముగ్గురి నుంచి రూ.33 లక్షలు స్వాహా...
డిజిటల్ అరెస్టు సహా మూడు రకాలైన నేరాల్లో ముగ్గురు నగర వాసుల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.33 లక్షలు కాజేశారు. ఈ మేరకు శుక్రవారం వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. యాకుత్‌పురకు చెందిన వృద్ధుడికి (75) పోలీసు అధికారుల మాదిరిగా ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆయన ఆధార్ కార్డు దుర్వినియోగమైందని చెప్పారు. ఆపై కొందరు యూనిఫాంలో వీడియో కాల్స్ చేసి ఐపీఎస్ అధికారులుగా మాట్లడిన నేరగాళ్లు నేషనల్ సీక్రెట్స్ యాక్ట్ కింద కేసు నమోదైందని భయపెట్టారు. డిజిటల్ అరెస్టు చేశామని, విషయం ఎవరికీ చెప్పద్దని భయపెడుతూ గత నెల 19 నుంచి ఈ నెల రెండో తేదీ వరకు మొత్తం రూ.21,01,650 కాజేశారు. అబిడ్స్‌కు చెందిన ఓ బాధితుడికి (35) ఆన్‌లైన్‌లో ఉద్యోగం పేరుతో ఎర వేసిన సైబర్ నేరగాళ్లు ఆకర్షణీయ జీతమంటూ ఎర వేశారు. ఆపై గూగుల్ రివ్యూస్ సహా వివిధ టాస్క్‌లు ఇచ్చి, కమీషన్ల పేరుతో వర్చువల్ యాప్‌లో లాభాలు చూపించారు. ఆపై పెట్టుబడులంటూ రూ.10,25,550 డిపాజిట్ చేయించుకున్నారు. యాప్‌లో రూ.15,57,900 లాభం చూపించి... విత్‌డ్రా చేసుకోవాలంటే మరికొంత కట్టాలనడంతో అనుమానం వచ్చిన బాధితుడు ఆరా తీసి తాను మోసపోయానని గుర్తించాడు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తికి (44) వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.1,61,720 కాజేశారు. ఈ ముగ్గురి బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మాట్రిమోనియల్ ఫ్రాడ్ చేసిన ఇద్దరు కిలేడీలు
నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.25 లక్షలు స్వాహా
బ్యాంకు ఖాతాలు ఇచ్చిసహకరించిన హైదరాబాదీ
ఇద్దరిని అరెస్టు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు