
నిల్వ ఉంచిన 34 సిలిండర్ల పట్టివేత
పహాడీషరీఫ్: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్‌కు విక్రయిస్తున్న కేంద్రంపై మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడలోని కావ్య ప్లాస్టిక్, స్టీల్ హౌస్‌లో పోలోడు గోవర్ధన్, మామిడిపల్లికి చెందిన రాజు, కాటేదాన్‌కు చెందిన అనిల్‌లు అక్రమంగా సిలిండర్లను నిల్వచేసి అవసరమైన వారికి రెట్టింపు ధరలో విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి, వారి వద్ద నుంచి వివిధ పరిమాణాలకు సంబంధించిన 34 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
రోడ్లపై ‘బైక్ స్టంట్లు’
రాజేంద్రనగర్: ద్విచక్ర వాహనాలతో రోడ్లపై స్టంట్లు చేస్తూ వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్న ఇద్దరు యువకులతో పాటు మరో మైనర్‌ను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన అహ్మద్ బిన్ ఫారూఖ్, అతని స్నేహితుడు మహ్మద్ ఆజంలు రెండు ద్విచక్ర వాహనాలపై మరో స్నేహితుడు మైనర్ బాలుడు (16)తో కలిసి గురువారం ఉదయం అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ వైపు ప్రయాణిస్తున్నారు. రెండు బైక్‌లపై స్టంట్లు చేస్తూ వాహనాలను నిర్లక్ష్యంగా నడిపారు. దీంతో రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. కొందరు వాహనదారులు తమ సెల్‌ఫోన్‌లో ఈ విన్యాసాలను చిత్రీకరించి సోషల్ మీడియాతోపాటు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులకు పంపిచారు. వాహనాల నంబర్ల ఆధారంగా ఇద్దరు యువకులతో పాటు మైనర్‌ను గుర్తించి పోలీసులు సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాలతో పాటు ముగ్గురిని తదుపరి విచారణ నిమిత్తం అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్బంగా రాజేంద్రనగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, ఇన్‌స్పెక్టర్ రాజులు మాట్లాడుతూ..ద్విచక్ర వాహనాలపై స్టంట్లు చేస్తే వారికి శిక్ష తప్పదన్నారు. మైనర్లకు వాహనాలు అందించిన యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు