
108 సిబ్బందికి అవార్డులు
మొయినాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఆల్ ఇండియా ప్రిసన్ డ్యూటీ మీట్‌లో ఉత్తమ సేవలు అందించిన 108 సిబ్బంది అవార్డులు అందుకున్నారు. నాలుగు రోజులపాటు జరిగిన 7వ ఆల్ ఇండియా ప్రిసన్ డ్యూటీ మీట్ 2025లో దేశంలోని అన్ని రాష్టాల క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడల్లో గాయపడినవారికి చికిత్స అందించడం, ఆసుపత్రికి తరలించడంలో మొయినాబాద్ 108 సిబ్బంది ఈఎంటీ భూక్య శ్రీకాంత్, పైలెట్ గవ్వల చంద్రశేఖర్ ఉత్తమ సేవలు అందించారు. వారి సేవలను గుర్తించిన ప్రిసన్ డీజీ సౌమ్యమిశ్ర గురువారం జరిగిన ముగింపు కార్యక్రమంలో అవార్డులు అందజేసి అభినందించారు.
ద్విచక్ర వాహనం ఢీకొన్న
సంఘటనలో వృద్ధుడి మృతి
నాగోలు: ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ (70) నాగోలు బండ్లగూడలో పండ్లు అమ్ముతూ జీవనం సాగించేవారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో పని ముగించుకొని భారత్ పెట్రోల్ పంప్ ఎదుట రోడ్డు పక్కన టీ తాగి తన బైక్ వైపు వెళ్తుండగా నాగోలు నుండి బండ్లగూడ వైపు వేగంగా వచ్చిన గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయడిన ఖాజా మొయినుద్దీన్‌ను చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.