
ఆపరేటర్లను ఆదుకోవాలి
మీర్‌పేట: ముందస్తు సమాచారం లేకుండా వైర్లు తొలగించడంతో దాదాపు 5 లక్షల మంది ఆపరేటర్లు రోడ్డున పడ్డారని, తమకు న్యాయం చేయాలని కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లు బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డికి వినతిపత్రం అందజేశారు. గత 20 ఏళ్లుగా తాము ఇదే వృత్తిని కొనసాగిస్తున్నామని, ప్రభుత్వ నిర్ణయంతో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, కేబుల్ టీవీలు, బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని వివరించారు. తమకు మరో వృత్తి తెలియదని, ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన ఆమె ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేబుల్, ఇంటర్నెట్ అసోసియేషన్ ప్రతినిధులు లక్ష్మణ్ ముదిరాజ్, శేఖర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, హనుమంతు, సాయినాథ్, చందు, శేఖర్, చారి తదితరులు ఉన్నారు.
● పంచిన ఘనత కమ్యూనిస్టులదే
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
అబ్దుల్లాపూర్‌మెట్: పేదలకు పది లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత కమ్యూనిస్టులదేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. బుధవారం ఆయన పెద్దఅంబర్‌పేట మున్సిపల్ కేంద్రంలో వీర తెలంగాణ సాయుధ పోరాట సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో కమ్యూనిస్టులు అగ్రభాగాన నిలిచారని గుర్తు చేశారు. నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర ముఖ్యమైందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ఎర్రజెండా రైతు కూలీల తరఫున పోరాటాలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, మండల కార్యదర్శి నర్సింహ, సభ్యులు శివకుమార్, ముత్యాలు, బాలరాజు, శ్రీశైలం, భిక్షపతి, ఊషయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
క్రీడా సమాఖ్య జిల్లా కార్యదర్శిగా పర్వతాలు గౌడ్
కందుకూరు: కొత్తగూడ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ ఎం.పర్వతాలుగౌడ్ జిల్లా క్రీడా సమాఖ్య కార్యదర్శిగా నియమితులైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి వెంక్యానాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం కళాశాలలో ప్రిన్సిపాల్ ఎం.మంగరాజు ఆధ్వర్యంలో పీడీలు, అధ్యాపకులు ఆయన్ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పీడీలు లాలూనాయక్, ఎం.ఈశ్వర్, భీక్యానాయక్, జి.జగన్, డాక్టర్ బాల్‌రాజ్, డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ‘సాక్షి’పాత్రికేయుడు రఘునందన్ పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డి ఆయన్ను పరామర్శించారు. డాక్టర్ అనురాగ్‌రెడ్డితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రఘునందన్‌కు మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు. పరామర్శించిన వారిలో విష్ణువర్ధన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రాంచందర్‌నాయక్, వెంకట్ తదితరులు ఉన్నారు.

ఆపరేటర్లను ఆదుకోవాలి

ఆపరేటర్లను ఆదుకోవాలి