
పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించాలి
ఆమనగల్లు: రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రాంచందర్ డిమాండ్ చేశారు. తలకొండపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి రైతుసంఘం, ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. అంతకుముందు తలకొండపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి తహసీల్దార్ రమేశ్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాంచందర్ మాట్లాడుతూ.. వందల ఎకరాలు ఉన్న భూస్వాముల భూములను కాపాడడానికి అలైన్‌మెంట్ మార్చారని ఆరోపించారు. ప్రస్తుత అలైన్‌మెంట్‌తో సన్న, చిన్నకారు రైతుల భూములు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ప్రకటించుకుంటూ పేద రైతుల పొలాలు ఎందుకు లాక్కుందో చెప్పాలని ప్రశ్నించారు. మొదట ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట య్య, సీపీఎం మండల కన్వీనర్ కురుమయ్య, నాయకులు శివశంకర్, వెంకటస్వామి, లక్ష్మయ్య, శ్రీను, పరమేశ్, నర్సింహారెడ్డి, యాదయ్య, రమేశ్, వెంకటేశ్, కృష్ణస్వామి, ధర్మారెడ్డి, రాములు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్