
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు
● శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి
● 207 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు
ఇబ్రహీంపట్నం రూరల్: విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పట్నం మహేందర్‌రెడ్డి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం 207 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేస్తూ వారిని ఉన్నత శిఖరాలకు చేర్చేది ఉపాధ్యాయులే అన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా నుంచి 207 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికవడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. చేవెళ్ల శాసన సభ్యుడు కాలె యాదయ్య మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికి ఆదర్శప్రాయమన్నారు. ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్రపతి వరకు ఎదగడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు దయానంద్ గుప్తా, ఏవీఎన్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీఈఓ సుశీందర్‌రావు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.