
రేపటి నుంచి ఏఐపై జాతీయ సదస్సు
షాద్‌నగర్‌రూరల్: గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ నెల 12, 13న కృత్రిమ మేథా(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె ఆధ్వర్యంలో నగరంలోని సెక్రెటేరియట్‌లో గిరిజన, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ నీతాపోలె మాట్లాడుతూ... గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాల, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఏఐపై జాతీయ సదస్సు ఉంటుందన్నారు. ఈ సదస్సులో ప్రత్యక్ష పద్ధతి(ఆఫ్‌లైన్), పరోక్ష పద్ధతి(ఆన్‌లైన్)లో సెమినార్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సవ్యసాచి ఘోష్, ట్రైబర్ వెల్ఫేర్ సెక్రటరీ సీతాలక్ష్మి, అడిషనల్ సెక్రటరీ మాధవిదేవి, ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలల డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ వేణుగోపాల్‌రావు, గిరిజన గురుకుల ఓఎస్డీ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
వాల్‌పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి